రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫిల్మ్ వెబ్ మీడియాపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఫేక్ వెబ్ సైట్స్ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడడం మీడియాని హీటెక్కించింది. మా సినిమాలు లేకపోతే మీరు లేరు…మా సినిమా వాళ్లు ఇచ్చే డబ్బులతో బ్రతుకుతూ మా జీవితాలతోనే ఆటలా? అంటూ ఓ రేంజ్ లో రెండు..మూడు వెబ్ సైట్లపై డైరెక్టుగానే దాడికి దిగాడు. మీ తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుడు దారి పట్టిస్తున్నారని నివురు గప్పిన నిప్పులా అక్కసు వెల్లగక్కాడు. ఇప్పటివరకూ ఏ హీరో కూడా ఫిల్మ్ మీడియాని ఉద్దేశించి ఇంత తీవ్రమైన కామెంట్లు చేసింది లేదు. దీంతో మిగతా హీరోలంతా రౌడీ స్టార్ కి అండగా బరిలో దిగారు. మెగాస్టార్ చిరంజీవి..సూపర్ స్టార్ మహేష్ ..రానా..పూరి జగన్నాథ్ సహా పలువురు స్టార్ హీరోలు, యంగ్ హీరోలు రౌడీ స్టార్ కి మద్దతుగా నిలిచారు. మీడియా పై ఓ స్టాండ్ తీసుకుని ఒక్కడే వార్ కి సిద్దమైనా వెంట సైన్యమే తయారైంది.
అయితే మీడియాలో మాత్రం టాక్ వేరొకలా ఉంది. అసలు దేవరకొండను హీరోని చేసిందే ఆ వెబ్ మీడియా. ఆ సంగతిని విస్మరించి వ్యవరించాడని మీడియా అధినేతలు ఫైర్ అవుతున్నారు. మంచిని మంచిగానే చెప్పాం. చెడును చెడుగానే చూపాం. అందులో తప్పేమీ లేదు. ఎక్కడా కల్పిత వార్తలు రాయలేదు. విషయం ఉన్న సినిమాల్ని ఆకాశానికి ఎత్తాం. లేని సినిమా పాతాళానికి తొక్కిన మాట వాస్తవం. అయితే దేవరకొండ చేసిన వ్యాఖ్యల్లో అర్ధం ఉంది కానీ..మిగతా హీరోలు ఎందుకిలా బయటపడినట్టు అంటూ సదరు మీడియా ప్రతినిధులు సీరియస్ అవుతున్నారు. రకరకాల సందర్భాల్లో వాళ్ల ఫ్యామిలీ విషయాలను మీడియా ఫోకస్ చేసిందని ఇన్నాళ్లు మౌనంగా ఉండి ఇప్పుడొచ్చారా? అంటూ సీరియస్ అవుతున్నారు.
మహేష్ స్టార్ అవ్వడంలో అభిమానులు ఎంత కీలక పాత్ర పోషించారో? ఫిల్మ్ వెబ్ మీడియా అంతకు మంచి కీలక పాత్ర పోషించింది. మీ సినిమాలు ప్రారంభం దగ్గర నుంచి రిలీజ్ వరకూ ప్రచార బాధ్యతల్ని మోసేది మీడియా. మిమ్మల్ని హీరోలని చేసింది మీడియా.. మీ సినిమాల్లో తప్పొప్పులను ఎత్తి చూపింది మీడియా. ఆ తప్పులు చెప్పడమే వెబ్ మీడియా చేసినా తప్పా! దీనికి రౌడీ స్టార్ కి మద్దతిచ్చిన హీరోలంతా సమాధానం చెప్పాలంటూ డిమాండ్ల ఫర్వం మొదలైంది. సెలబ్రిటీ అన్న తర్వాత మీడియా ఎన్నో విషయాలను ఫోకస్ లోకి తీసుకొస్తుంది. గాసిప్పులు ఇక్కడ తప్పదు. అంత మాత్రాన మీడియాపై కక్షగట్టడం న్యాయమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మీ గొంతు సినిమాకి అన్యాయం జరిగిందని కానే కాదు.. వ్యక్తిగత విషయాలను ఫోకస్ లోకి తీసుకు రావడం వల్లనే అంతా కక్షతో ఒక్కటయ్యారంటూ వెబ్ మీడియాల్లో కథనాలు వేడెక్కిస్తున్నాయి. అలాగే ఇటీవల లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీలు ఇళ్లకు పరిమితమై రకరకాల ఛాలెంజ్ లు విసరడంపైనా పలువురు మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. కొవిడ్-19 కారణంగా ప్రజలంతా కష్టకాలంలో నానా ఇబ్బందులు పడుతుంటే సమాజానికి ఉపయోగపడే పనులు మానేసి ఈ ఛాలెంజ్ లు ఏమిటి? అంటూ నేటి జనుల విమర్శలను వెబ్ మీడియా ఓ రేంజ్ లో వైరల్ చేసింది. ఇవన్నీ మనసులో పెట్టుకునే స్టార్లంతా టైమ్ చూసి ఇలా రౌడీస్టార్ వెంట నిలిచారని .. మీడియా పై అక్కసును వెళ్లగక్కారన్నది పలువురి అభిప్రాయం. అన్నట్టు మెగాస్టార్ చిరంజీవి విరాళాన్ని.. సీసీసీ సేవల్ని కూడా మీడియా బాగానే ప్రమోట్ చేసింది. ఏవో కొన్ని మీడియాలు నెగెటివ్ కథనాలు వండి వార్చినా మెజారిటీ మీడియా చిరుకి అండగా నిలిచింది. అయినా ఆయన వెబ్ మీడియా పై వార్ కి వస్తున్న దేవరకొండను సపోర్ట్ చేయడం ప్రస్తుతం చర్చకొచ్చింది.