‘గజనీ’ మెమరీ లాస్, ‘పోకిరి’ ట్విస్ట్ కలిపి కుమ్మేస్తున్నాడు

రామ్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ రీసెంట్ గా సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ సినిమాను పూరీ కనెక్ట్స్‌ పతాకంపై పూరీ, ఛార్మి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రామ్ పాత్ర చాలా ఇంట్రస్టింగ్ గా ఉందని ప్రచారం జరుగుతుంది.

ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చెప్పుకునే దాని ప్రకారం ఈ సినిమా మొత్తం గజనీ టైప్ మెమెరీ లాస్ లా కథ జరుగుతుంది. ఈ చిత్రంలో హీరో గతం మర్చిపోతుంటాడు. కాసేపు గుర్తుకు వస్తూ వుంటుంది. గతం గుర్తుకు వచ్చినపుడు అందుకు సంబంధించిన విలన్స్‌పై అటాక్ చేస్తుంటాడు. ఆ విషయం తెలిసిన విలన్స్ అతనికి గతం గుర్తుకు లేని టైమ్‌లో ఎదురుగా వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారనే ప్రచారం జరుగుతుంది. హీరో ‘ఇస్మార్ట్ శంకర్’ ఎపుడు ఎలా ఉంటాడో తెలియక విలన్ పడే తిప్పలు ఆడియన్స్‌కు నవ్వులు తెపిస్తాయంటున్నారు.

అలాగే క్లైమాక్స్ ‘పోకిరి’ తరహాలో ఒక రేంజ్ లో ట్విస్ట్ వుండేలా పూరి డిజైన్ చేశాడని అంటున్నారు. ఇక హీరో క్యారెక్టరైజేషన్ లోనే కావలసినంత కామెడీ వుండేలా చూసుకున్నాడని చెబుతున్నారు.

నిజానికి ఈ కథను తన కొడుకు కోసమే పూరి తయారు చేసుకున్నాడట. అయితే స్టార్ డమ్ వున్న హీరోతో చేస్తే బాగుంటుందని సన్నిహితులు చెప్పడంతో రామ్ ను సంప్రదించాడట. మొదట ఈ ప్రాజెక్ట్ చేయడానికి రామ్ కూడా అంతగా ఆసక్తిని చూపలేదట. కానీ కథ విన్న తరువాత .. ముందుగా తాను ప్లాన్ చేసుకున్న ప్రాజెక్టులను పక్కన పెట్టేసి ఈ సినిమా చేయడానికి రంగంలోకి దిగాడని చెబుతున్నారు.

ఈ చిత్రం కోసం రామ్‌ మరింత ఫిట్‌గా తయారయ్యారు. ఇందులో ఆయన విభిన్నమైన మాస్‌ పాత్రలో కనిపించనున్నారట. ఈ ఏడాది కుదిరిన క్రేజీ కాంబినేషన్‌ ఇది. ఎనర్జిటిక్‌ స్టార్‌, డ్యాషింగ్‌ డైరెక్టర్‌ కలిసి ప్రేక్షకుల్ని ఎలా అలరించబోతున్నారో చూడాలి. డిజాస్టర్ చిత్రం ‘మెహబూబా’ తర్వాత పూరీ తీస్తున్న చిత్రమిది. రామ్‌ గత ఏడాది ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాతో ఫ్లాప్ ఇచ్చారు.