అందలమెక్కిన జానపద గీతం

అవకాశం అదృష్టం రెండు పక్క పక్కనే వుంటాయేమో ! అవకాశం రాగానే అదృష్టం కూడా వెన్నంటే ఉంటుంది కాబట్టి ఊహించని స్థాయికి తీసుకెడుతుంది అనడానికి నిదర్శనం ముగ్గురు మట్టిలో మాణిక్యాలు . ఆంధ్ర ప్రదేశ్ లోని మూడు ప్రాంతాల నుంచి ముగ్గురు గాయని గాయకులు గత సంవత్సరం సినిమా రంగానికి పరిచయం అయ్యారు .

జనులు మెచ్చేదే జానపదం అన్నారు . ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో జానపద పాటలకు ఆదరణ ఉండేది .
అప్పటి కవులందరూ జానపద గీతాలు రచించినా ఎక్కువ పాటలు రాసి జానపద కవిగా ప్రఖ్యాతిగాంచింది మాత్రం కొసరాజు రాఘవయ్య చౌదరి గారే . ఆ తరువాత క్రమముగా జానపదం కనుమరుగయ్యింది . కొన్నేళ్ళకు తెలంగాణ జానపదం మురిపించడం మొదలు పెట్టింది .

పాతొక రోత కోతోక వింత అన్నారు . కానీ పాతవి కూడా అప్పుడప్పుడు ప్రేక్షకులను మెప్పిస్తుంటాయి అనడాని నిదర్శనం మన జానపద గీతాలు . అందులో సినిమా ప్రపంచానికి సంబంధం లేకుండా తమ పనులు తాము చేసుకునేవారికి అవకాశం వచ్చింది , అందలము ఎక్కించింది .

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా నటించిన ‘రంగస్థలం ” సూపర్ డూపర్ హిట్ అయ్యింది . ఈ సినిమాలోని పాటలు అన్ని వర్గాలవారిని ఊపేశాయి . ఇందులో జిగేలు రాణి పాట పాడింది గంట్ల వెంకట లక్ష్మి . బుర్రకథలు చెప్పుకుంటూ జీవనం సాగిస్తుంది . విశాఖ జిల్లా అనకాపల్లి మండలం బీఆర్టీ కాలనీలో నివాసం ఉంటుంది . ఈమె గొంతొలోని మాధుర్యాన్ని చూసి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో పాడే అవకాశం వచ్చింది . ఈ పాట పెద్ద హిట్ అయ్యింది . అయితే ఈమెను మద్యలోవున్న అతను మోసం చేశాడు . ఆలస్యంగా తెలుసుకున్న సుకుమార్ ఆమెను పిలిపించి ఒక లక్ష రూపాయలు ఇచ్చి గౌరవించాడు .

దర్శకుడు మేర్లపాక గాంధీ రాయలసీమ నుంచి వచ్చాడు . అతనికి పరిచయం వున్న జానపద గాయకుడు పుట్టా పెంచల దాస్ తో “కృష్ణార్జున యుద్ధం ” సినిమాలో దారి చూడు ., దుమ్ము చూడు ” పాటను పాడించాడు . నాని నటించిన ఈ సినిమా ఏవరేజ్ గా ఆడింది కానీ , ఈ పాట మాత్రం ప్రేక్షకుల నోళ్ళలో మారుమ్రోగి పోయింది .

త్రివిక్రమ్ శ్రీనివాస్ పెంచల దాస్ ను “అరవింద సమేత వీర రాఘవ “సినిమాకు మాటలు వ్రాసేటప్పుడు సహాయకునిగా పెట్టుకున్నాడు . పెంచల దాస్ కడప జిల్లా లోని ఓ మారుమూల గ్రామం . డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తున్నాడు . అతని జీవితంలో ఊహించని స్థాయి వచ్చింది .

తూర్పు గోదావరి జిల్లా వడిశలేరు గ్రామానికి చెందిన బేబీ , రోజు కూలి పని చేసుకొని జీవనం సాగిస్తుంది . నిత్య జీవితంలో పాటలు పాడుతూ పనులు చేసుకుంటుంది . ఇది గమనించిన ఆమె స్నేహితురాలు ఆమె పాడిన “ఓ చెలియా నా ప్రియా సఖియా ‘పాట రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టింది . ప్రేమికుడు చిత్రంలోనిది ఈ పాట . ఈ పాటను స్వర పరిచింది ఏ ఆర్ రెహ్మాన్ . బేబీ పాట చూసి చాలా మంచి వాయిస్ అని కొనియాడుతూ పేస్ బుక్ లో పెట్టాడు .

అంతే అది వైరల్ అయిపోయింది . గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె ఆమెను కలిసి “తన పలాస 1978″చిత్రంలో గాయనిగా అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించాడు . హైదరాబాద్ పిలిపించి పాటను కూడా రికార్డు చేశాడు .
ఆ తరువాత సంగీత దర్శకుడు కోటి కూడా ఆమెతో అనేక పాటలు పాడించాడు . ఈ ముగ్గురు జానపద గాయని గాయకుల జీవితాలు అనుకోని మలుపు తిరిగాయి . తెలుగు సినిమాలో మళ్ళీ జానపద గీతాలు చూసే భాగ్యం కలుగుతుంది . అలాగే మట్టిలో మాణిక్యాలకు అవకాశం వస్తుంది . మరి ఇది శుభ పరిణామమే కదా !
– భగీరథ