ఎవ‌రు ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్ ఎలా ఉంది?

అడివి శేష్ న‌టించిన ఎవ‌రు ఆగ‌స్టు 15న స్వాతంత్య్ర దినోత్స‌వ కానుక‌గా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా టీజ‌ర్.. ట్రైల‌ర్ ఇటీవ‌లే రిలీజై ఆక‌ట్టుకున్నాయి. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ఆద్యంతం థ్రిల్ల‌ర్ మోడ్‌లో గ్రిప్పింగ్‌గా క‌నిపించింద‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. క్రైమ్ థ్రిల్ల‌ర్ లో రెజీనా పాత్ర చాలా డిఫ‌రెంట్ గా స‌స్పెన్స్ తో క‌నిపిస్తోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ ర‌క్తి క‌ట్టిస్తోంది. అది హ‌త్య‌నా? రేప్ నుంచి కాపాడుకోవ‌డానికి ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం అలా చేసిందా? అవినీతి అధికారి విక్ర‌మ్ వాసుదేవ్ (శేష్‌) ఇన్వెస్టిగేష‌న్ ఏంటి? అన్న‌ది స‌స్పెన్స్ మెయింటెయిన్ చేశారు. వెంక‌ట్ రాంజీ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. పీవీపీ నిర్మించారు.

తాజాగా ఈ సినిమా ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌థ విష‌యానికి వ‌స్తే ఇదో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ డ్రామా. ఒక గ‌దిలో సాగే క్రైమ్‌.. హైడ్రామాతోనే ప్ర‌థ‌మార్థం సినిమాని మ‌లిచారు. ద్వితీయార్థంలో అస‌లు స‌స్పెన్స్ ఏమిటి.. చిక్కుముడులు ఏమిటి? అన్న‌ది రివీల్ చేస్తారు. ప‌తాక స‌న్నివేశాల్ని ఎంతో వైవిధ్యంగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే సినిమా ఆద్యంతం స్లో ఫేస్ లో సాగుతుండ‌డం కొంత బోర్ క‌లిగిస్తుంది. అలాగే మాస్ ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించే మ‌సాలా కంటెంట్ ఎక్క‌డా క‌నిపించ‌దు. క‌థ‌, క‌థ‌నం, జోన‌ర్ ఇవ‌న్నీ ఒక సెక్ష‌న్ ఆడియెన్‌కి మాత్ర‌మే న‌చ్చుతాయి. క్రైమ్ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ జోన‌ర్ అంటే ఒక వ‌ర్గాన్ని దృష్టిలో పెట్టుకునే తెర‌కెక్కించాల్సి ఉంటుంది. ఈ సినిమాని స్పానిష్ మూవీ ది ఇన్విజిబుల్ గెస్ట్ ఆధారంగా రూపొందించార‌ని ప్ర‌చారం సాగుతోంది. దానికి అధికారిక రీమేక్ అని ఎక్కడా చెప్ప‌లేదు. అయితే గ‌దిలో మ‌ర్డ‌ర్ .. దాని చుట్టూ మిస్ట‌రీ క‌థ చూస్తుంటే ఆ సినిమాకి స్ఫూర్తి అని అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే బాలీవుడ్ లో బ‌ద్లా అనే చిత్రం ఇదే త‌ర‌హా క‌థాంశంతో వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. శేష్ కి మ‌రో హిట్టొస్తుందా లేదా అన్న‌ది చూడాలి.