రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల నిలిపివేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తెలుగుదేశం పార్టికి చెందిన వారు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ కార్యకర్త దేవీబాబు చౌదరి ఎన్నికల కమిషన్‌ను కలిసి ఈ నెల 22న విడుదల కాబోతున్న ఈ సినిమా విడుదల నిలిపివేయాలనికోరారు.
సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రను నెగెటివ్‌గా చూపించారని, సినిమా ఓటర్లపై ప్రభావం చూపుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలి విడత పోలింగ్ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుపై ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పందించారు .
ఎన్నికల అధికారి ఏమన్నారంటే… తెలుగు దేశం పార్టీ వారు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంపై ఇచ్చిన ఫిర్యాదుపై ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ స్పందిస్తూ…‘ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు సినిమాలో ఉన్నాయా? ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందా? ఎన్నికల కోడ్ ఉల్లంఘించే కంటెంట్ ఏమైనా ఉందా? తదితర అంశాలను పరిశీలించిన తర్వాత అవసరం అయితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.