ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే…ఎన్నికలను ప్రభావం చేసే పనులన్నిటినీ వాయిదా వెయ్యాల్సి ఉంటుంది. చాలా సార్లు ప్రభుత్వం చేయాల్సిన పలు పనులకు కోడ్ బ్రేక్ పడుతూంటుంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ కు ఆ సమస్య రాకుండా రిలీజ్ డేట్ లను ఫిక్స్ చేసారంటున్నారు.
నందమూరి బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా కథానాయకుడు, మహా నాయకుడు అనే టైటిల్ తో నిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చివరి నిమిషంలో దర్శకుడు తేజ తప్పుకోవటంతో క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ శరవేగంగా జరుగుతోంది.
అంతేకాదు ఇప్పటికే ఈ సినిమాకు సంభందించిన ఫొటోలు విడుదల చేసి ప్రాజెక్టుపై క్రేజ్ తెచ్చేసారు. అలాగే రెండు పార్ట్ లను 15 రోజుల వ్యవధిలో రిలీజ్ చేస్తున్నారు. మొదటి పార్ట్ ని జనవరి 9, రెండో పార్ట్ ని జనవరి 24న విడుదల చేయనున్నారు. అయితే అలా హడావిడిగా రిలీజ్ చేస్తే మొదటి సినిమా పెట్టిన పెట్టుబడి రాబట్టకుండానే సెకండ్ పార్ట్ రిలీజ్ కు వచ్చేస్తుంది. దాంతో రికవరీ ఇబ్బంది అవుతుందని ట్రేడ్ లో లెక్కలు వేస్తున్నారు.
అయితే దర్శక,నిర్మాతల లెక్కలు వేరేగా ఉన్నాయి. సెకండ్ పార్ట్ ఉద్దేశ్యపూర్వకంగా రిలీజ్ ని వాయిదా వేస్తే కనుక..అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేస్తాయి. అప్పుడు ఎలక్షన్ కోడ్ అంటూ కొత్త సమస్య ఎదరవుతుంది. దానికి తోడు రెండో పార్ట్ లో ఎన్టీఆర్ ..రాజకీయ జీవితం చూపించనున్నారు. ఇవన్నీ ఆలోచించే అలా రెండు రిలీజ్ డేట్స్ కు మధ్య పెద్ద తేడా లేకుండా చేసారని తెలుస్తోంది.