లాక్ డౌన్ ప్రజల టీవీ వీక్షణ అలవాట్లను అమాంతం మార్చేసింది. ఛానెళ్లు అన్నీ కంటెంట్ అయిపోయాక పాత సినిమాలు, డబ్బింగ్ సినిమాలపై ఆధారపడుతున్నాయి. నిన్న విడుదల చేసిన బార్క్ రేటింగ్స్ ప్రకారం డబ్బింగ్ సినిమాలు హిందీ టెలివిజన్‌లో టాప్ టీఆర్పీతో శాసించాయి.
అండ్ పిక్చర్స్ లో ప్రసారం అయిన సాహో హిందీ వెర్షన్ 83.34 లక్షల మంది వీక్షణను నమోదు చేసింది. ఈ చిత్రం హిందీలో ఎక్కువగా చూసిన చిత్రంగా నిలిచింది. `బాహుబలి ది బిగినింగ్` హిందీ వెర్షన్ సోనీ మాక్స్ లో 73.89 లక్షల వీక్షణలతో టాప్ లేపింది. రజనీకాంత్ దర్బార్ స్టార్ గోల్డ్ లో ప్రసారం చేస్తే 71.90 లక్షల మంది వీక్షణతో సంచలనమైంది. అక్షయ్ కుమార్ `హౌస్ ఫుల్ 4`.. అమితాబ్ బచ్చన్ `సూర్యవంశం` టాప్ 5 చిత్రాలలో నిలిచాయి. టాప్ లో తెలుగు-తమిళ చిత్రాలే హవా సాగించాయి.