గతంలో టాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇందులో చాలా మంది సినీ ప్రముఖుల పేర్లు ప్రధానంగా వినిపించాయి. హీరోలు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు సహా పెద్ద ఎత్తున డ్రగ్స్ విక్రయాలు జరిపినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఉన్నత అధికారులు చాలా మంది సెలబ్రిటీలను విచారణ చేసారు. అప్పట్లో ఈ వ్యవహారంపై టాలీవుడ్ లో పెద్ద సంచలనమే రేగింది. టాలీవుడ్ పై మాయని మచ్చలా పడింది. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం విషయాన్ని అంతే సీరియస్ గా తీసుకుని ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించింది.
ప్రభుత్వం జరిపిన విచారణపై తర్వాత ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. దీనిపై అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపణలు మిన్నంటాయి. టాలీవుడ్ పై డ్రగ్స్ ముద్ర పడితే డెవలెంప్ ఆగిపోతుందని సీఎం వివాదాన్ని పట్టిపట్టనల్లే వదిలేసినట్లు ఆరోపించారు. తర్వాత కొన్నాళ్లకి విషయాన్ని అంతా మర్చిపోయారు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు. అయితే తాజాగా మరోసారి టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేగింది. లాక్ డౌన్ నేపథ్యంలో పెద్ద ఎత్తున విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. గతంలో డ్రగ్స్ కేసుల్లో పేరున్న వారందరిపై లాక్ డౌన్ నేపథ్యంలో నిఘా పెట్టినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. దీనిలో భాగంగా టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున విక్రయాలు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.
మొత్తంగా 300 మంది ప్రముఖుల జాబితా అధికారుల వద్ద ఉన్నట్లు సమాచారం. ఇందులో సెలబ్రిటీలు, విద్యార్థులు, నైజీరియన్లు ఉన్నట్లు ఎన్ ఫోర్స్ మెంట్ నిఘాలో తేలినట్లు సమాచారం. సినీ ప్రముఖులు, బడా బాబులు, వ్యాపార వేత్తలు చురుకుగా విక్రయాల్లో పాల్గొన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో కొందరు సడలింపులు వినియోగించుకుని బెంగుళూరు లాంటి నగరాలకు వెళ్లి మరి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో టాలీవుడ్ లో సహా ఇతర రంగాల్లో డ్రగ్స్ విక్రయాలు జరిపిన ముఠాలు మళ్లీ యాక్టివ్ లోకి వచ్చినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ ఫోర్స్ మెంట్ తెలిపింది. ప్రస్తుతం ఈ సమాచారం టాలీవుడ్ లో టెన్షన్ వాతావరణానికి దారి తీస్తోంది.