దివిసీమ కోసం జోలె పట్టిన అగ్ర నటులు

ఇది 41 సంవత్సరాలనాటి  సంఘటన

తెలుగు ప్రజలను  విస్మయానికి , విభ్రాంతికీ , విషాదానికి  గురిచేసిన రోజు . 1977 నవంబర్ 19 అంటే సరిగ్గా  ఇదే రోజు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన రోజు . సముద్రం పొంగి జల ప్రళయం దివి సీమను ముంచెత్తిన రోజు .

83 గ్రామాలు జలదిగ్భందంలో  చిక్కుకున్నాయి . జలవిలయానికి  ఊపిరాడక 10 వేల మందికి పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు; రెండు లక్షలకు పైగా జంతువులు నీళ్లలో పడి ఊపిరాడక చనిపోయాయి .

కోట్లాది ఆస్తి నష్టం జరిగింది . ఇళ్ళు కూలిపోయాయి . ఆహార ధాన్యాలు నీటి పాలయ్యింది . సర్వం కోల్పోయి  లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు ఎటు  చూస్తే అటు శవాలు , దారి తెన్నూ లేని రహదారులు  , ఆనవాళ్లు పట్టని  గ్రామాలు . విషాదం నిండిన ముఖాలు .

నిరాశ్రయులైనవారికి తినడానికి తిండి , త్రాగటానికి గుక్కెడు నీరు లేదు . ఆపన్న హస్తం అందించే వారు కూడా పోవడానికి దారి లేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు . ప్రభుత్వం కూడా ఏమి చేయలేని స్థితి .

నవంబర్ 14న ఉత్తర భారతంలో మొదలైన తుపాను క్రమంగా ఆంధ్ర వైపు మరలింది . నవంబర్ 19 న దివి సీమను చుట్టూ ముట్టింది . గంటకు 204 కిలో మీటర్ల వేగంతో వీచే గాలులకు పూరి ఇళ్ళు  ఎగిరి పోయాయి . కుండా పోతగా కురిచే జాడి వానకు ఇళ్ళు  నెల మట్టమై పోయాయి . చాలా మంది నిద్రలోనే మృత్యు వాత పడ్డారు . రెండు తాటి చెట్లు అంత ఎత్తైన నీరు గ్రామాలను ముంచి వేసింది . గ్రామాలు , చెట్లు చేమలు, పశువులు నీటిలోపడి  మృత్యు వాత పడ్డాయి .

చూస్తుండగానే జల ప్రళయం ముంచెత్తింది . మృత్యువులా క్షణాల్లో కబళించింది . ఆడవాళ్లు, పాలు త్రాగే బిడ్డలు జల సమాధి అయ్యారు .

83 గ్రామాలు ఆనవాళ్లు పట్టకుండా నీటిలో మునిగిపోయాయి . 10 వేల మందికి పైగా ప్రజలు చనిపోయారు . రెండు లక్షలకు పైగా జంతువులు  మృత్యువాత పడ్డాయి . ఉబికి వచ్చే కన్నీరు తెలియకుండా ఉప్పెన ముంచెత్తింది .

లక్షలాది మంది కి తినడానికి తిండి లేదు , కట్టుకోవడానికి బట్టలేదు, తాగటానికి గుక్కెడు నీరు లేదు , ఉండటాన్ని ఇళ్ళు లేవు . నిరాశ్రయులై  ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు .  వారిని ఆదుకోవడానికి ప్రభుత్వంతో పాటు సామాన్య ప్రజలు కూడా ముందుకు వచ్చారు .

ప్రజలు కష్టాల్లో వున్నప్పుడు ఆదుకోవలసిన భాద్యత తమ మీద వున్నదని గ్రహించిన రామారావు, నాగేశ్వర రావు షూటింగ్లు రద్దు చేసి విరాళ కోసం జోలెలు పట్టుకున్నారు .హైదరాబాద్ సికిందరాబాద్ నగరాల్లో , రామారావు , నాగేశ్వర రావు మిగతా నటీనటులు జోలెలు పట్టుకొని రోడ్లపై  వస్తుంటే  ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు . తమ దగ్గర ఏది ఉంటే ఇది వేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు . ఆపన్నులకు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కూడా డబ్బు వసూలు చేశారు . మూడవ రోజు హైదరాబాద్ గోల్కొండ క్రాస్ రోడ్స్ లో వున్న రామకృష్ణ సినిమా స్టూడియోలో జోలెలో వచ్చిన వాటిని లెక్కపెట్టడానికి  క్రింద పోశారు . అప్పుడు జర్నలిస్ట్ గా నేను అక్కడే వున్నాను . అందరినీ  ఆశ్చర్య చకితులను చేశాయి . డబ్బుతో పాటు, ఉంగరాలు, గొలుసులు , ముక్కు పు డకలు, కమ్మలు , మంగళ సూత్రాలు కూడా వున్నాయి . మానవత్వం అంటే అది . సాటి మనిషికి సహాయ పడటం అంటే అదే .

సాటి మనిషిని ఆదుకోవడానికి ప్రజలు స్పందించిన తీరుకు అగ్ర నటులు చలించిపోయారు . ఆపదలో వున్న వారిని ఆదుకోవడం  మన భాద్యత అని ఎన్ .టి .రామారావు , అక్కినేని నాగేశ్వర రావు  భావించారు . తమ వంతు చేయూతను దివి సీమ ప్రజలకు అందించారు . ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో అప్పటిదే .

-భగీరథ