టాలీవుడ్ సీనియర్ నిర్మాత ఎం.ఎస్.రాజుకు దర్శకత్వం అంటే ఎంత ప్యాషనో చెప్పాల్సిన పనే లేదు. ఆయన చాలా కాలంగా దర్శకుడిగా రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకూ సరైన సక్సెస్ రాకపోయినా మొండిగా ఆయన పదే పదే దర్శకత్వ విభాగంపై పట్టు పట్టడంపై నిరంతరం పరిశ్రమలో చర్చ సాగుతుంటుంది. కొన్ని ప్రయత్నాలు ఫెయిలైనా.. ఎట్టకేలకు ఆయన యువతరం ట్రెండ్ ని పట్టేసినట్టే కనిపిస్తోంది.
ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న `డర్టీ హరి` గురించి ఇప్పటికే యువతరంలో చర్చ సాగుతోంది. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు యూత్ లో వైరల్ అయ్యాయి. తాజాగా రిలీజైన ట్రైలర్ జెట్ స్పీడ్ తో దూసుకెళుతోంది. ఈ ట్రైలర్ ఆద్యంతం `డర్టీ హరి` డర్టీ గేమ్ రక్తి కట్టించింది. ఇక ట్రైలర్ లో ఫ్రెండు చెప్పే ఐదు సూత్రాలు ఏమిటి? వాటిని డర్టీ హరి పాటించాడా లేదా? అన్నది ఇంట్రెస్టింగ్.
వద్దు వద్దు అంటూంటే స్నేహితుడి లవర్ కి లైనేసే డర్టీ హరి.. బాస్ కూతురికి క్లోజ్ అవుతాడు. ఇంకా అతడు ఆఫీస్ లో ఆఫీస్ వెలుపల వేసే వేషాలు.. ఫ్రెండు లవర్ తో వేసే వేషాలు వేడెక్కిస్తాయి. రొమాన్స్ కంటెంట్ ఒక రేంజులోనే చూపించారు రాజు గారు. విలువలతో కూడుకున్న కథలు ఎంచుకుని పాథాస్ స్టోరీస్ చూపిస్తే ఎవరూ చూడరని భావించారో ఏమో కానీ కాస్త డర్టీ విలువలున్న కథనే ఎంచుకుని ఎంతో మోడ్రన్ గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ట్రైలర్ చూస్తుంటే యువతరం దేవతలు తథాస్తు అని ధీవించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
నేటితరం ఆలోచనా విధానానికి దర్పణంగా నిలిచే సినిమా ఇదని అర్థమవుతోంది. హీరోగా శ్రవణ్ రెడ్డి స్మార్ట్ లుక్ ఆకట్టుకుంది. అతడి నటన లో ఈజ్ బావుంది. సిమ్రత్.. రుహానీ లాంటి అందగత్తెలతో తెర నిండుగా రొమాన్స్ ని ప్లాన్ చేసారు. మార్క్ కె రాబిన్ సంగీతం .. బాల్ రెడ్డి కెమెరా ప్లస్ కానున్నాయి. ఈ చిత్రాన్ని ఎస్.పి.జి. క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు- గూడూరు సాయి పునీత్ నిర్మించారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో సినిమా రిలీజ్ కానుంది.