సినిమా సూపర్ అంటూ సుకుమార్ ట్వీట్

సుకుమార్ వంటి స్టార్ డైరక్టర్ ఓ సినిమాని మెచ్చుకున్నారంటే అందరి దృష్టీ ఆ సినిమాపై పడుతుంది. రీసెంట్ గా విశ్వక్సేన్‌ హీరోగా తెరకెక్కిన ‘ఫలక్‌నుమా దాస్‌’ సినిమానీ సుకుమార్‌ ప్రశంసలతో ముంచెత్తేసారు. సుకుమార్‌ ప్రశంసించడంతో ఆ సినిమా పికప్ అయ్యింది. ఇక ఇప్పుడు ఆ అవకాసం ‘ఏజెంట్‌ ఆత్రేయ’ దక్కించుకున్నాడు. నిన్న శుక్రవారం విడుదలైన ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ’ సినిమాపై సుకుమార్‌ ప్రశంసల జల్లు కురిపించారు.

స్వరూప్ ఆర్ఎస్‌జే దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, శ్రుతి శర్మ జంటగా నటించిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్ టాక్‌తో నడుస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా నడిచే ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని చూసిన డైరెక్టర్ సుకుమార్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

‘‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ థ్రిల్లర్‌ కథాంశంతో ఆసక్తికరంగా ఉంది. డైరెక్టర్ స్వరూప్ గారి నెరేటివ్ స్టైల్ అద్భుతంగా ఉంది. బ్రిలియంట్ రైటింగ్, ఫెంటాస్టిక్ యాక్టింగ్, ఎక్స్‌లెంట్ సినిమాటోగ్రఫీ అన్నీ ఈ సినిమాకు బాగా కుదిరాయి. నవీన్ పొలిశెట్టి తన నటనతో ఆకట్టుకున్నాడు. టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు’’ అని సుక్కు ట్వీట్ చేశారు.