దిల్ రాజు గారు ఏంటి మీరేనా ఈ మాటలంటోంది..దారుణం

కుటుంబ కథా చిత్రాల నిర్మాతగా దిల్ రాజుకు మంచి పేరుంది. హిట్ ,ఫ్లాఫ్ లను పట్టించుకోకుండా తన ధోరణిలో ఆరోగ్యకర చిత్రాలు తీయటంలో ఆయన పండిపోయారు. అయితే గత కొద్ది కాలంగా ఆయన టైమ్ ఏమీ బాగోలేదు. వరస పెట్టి సినిమాలు చీదేస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నో అంచనాలతో చేసిన లవర్, శ్రీనివాస కళ్యాణం డిజాస్టర్స్ అవటం ఆయన్ను బాగా కలిచివేసిందనే చెప్పాలి.  ఈ క్రమంలో ఆయన దిగులు పెట్టేసుకున్నారో ఏమో కానీ…ముద్దు సీన్స్ లేకపోతే జనాలకి నచ్చటం లేదంటూ మీడియా దగ్గర వాపోయారు. “ఆర్ ఎక్స్ 100” సినిమా ఆ స్దాయి విజయం సాధించటం ఆయన జీర్ణించుకోలేకపోతన్నట్లు ఉన్నారు. దాంతో    ప్ర‌స్తుతం కిస్ సీన్లు లేక‌పోతే సినిమాలు ఆడ‌డం లేద‌ని అనేసారు.

అంతేకాకుండా ప్రేక్ష‌కులు ఎవ‌రూ మంచీ చెడూ ఆలోచించ‌డం లేద‌ని బాధపడ్డారు. సినిమాల్లో కేవలం.., ఎంట‌ర్‌టెయిన్మెంట్ మాత్రమే వెతుక్కుంటున్నారు. అది ఉంటే చాలన్నట్లుగా సినిమా చూస్తున్నారని ఆయన ఎనాలసిస్ చేస్తున్నారు.  రాబోయే రోజుల్లో   తాను నిర్మించే సినిమాల్లో  ఇక తాను కూడా ముద్దు సీన్ల‌నుపెట్టాలేమో అని వ్యాఖ్యానించారు. అయితే దిల్ రాజు వంటి స్టార్ నిర్మాత, మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి ఇలా ఆలోచించటం ఏమిటి అని ఆయన సినిమాలు ఫాలో అయ్యే అభిమానులు బాధపడుతున్నారు.

సినిమాల్లో కంటెంట్ బాగోలేక శ్రీనివాస కళ్యాణం, లవర్ ,కృష్ణాష్టమి వంటి చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి కానీ ముద్దు సీన్స్ లేక కాదు అని అంటున్నారు. కేవలం “ఆర్ ఎక్స్ 100” లో తప్ప హిట్ అయిన ప్రతీ సినిమాలోనూ ముద్దు సీన్స్ ఉంటున్నాయా..బాహుబలిలో ముద్దు సీన్ ఉందా …అంత పెద్ద హిట్టైంది అని నిలదీస్తున్నారు. అదీ పాయింటేగా సారు..