ప్రేక్షకులకి దిల్ రాజు అదిరిపోయే బంపర్ ఆఫర్

దిల్ రాజు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. శ్రావణ మాసంలో పెళ్లి చేసుకునే జంటలకు మాత్రమే ఈ అవకాశం. నితిన్, రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన సినిమా శ్రీనివాస కళ్యాణం. దిల్ రాజు, లక్ష్మణ్ కలిసి నిర్మించిన ఈ సినిమాకి సతీష్ వేగ్నేశ దర్శకత్వం వహించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కేరింత, ముకుంద వంటి హిట్ చిత్రాలకు సంగీతం అందించిన మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి కూడా సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ శ్రావణ మాసంలో పెళ్లి చేసుకోబోయే జంటలకు ఒక ఆఫర్ ప్రకటించారు దిల్ రాజు.

ఆగస్టు తొమ్మిదిన ఈ సినిమా రిలీజ్ చేయాలనుకుంది మూవీ టీమ్. సరిగా పన్నెండేళ్ల క్రితం అంటే 2006 ఆగష్టు 9 న బొమ్మరిల్లు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ ఇచ్చింది దిల్ రాజుకి. అదే డేట్ కి ఈ సినిమా రిలీజ్ అవటం విశేషం. అందుకే ఈ ఆఫర్. ఈ విషయమే దిల్ రాజు ఇలా తెలిపాడు. ” ఆగష్టు 9 మాకు చాలా సెంటిమెంట్. బొమ్మరిల్లు తర్వాత పన్నెండేళ్ళకి శ్రీనివాస కళ్యాణం అదే డేట్ కి కుదిరింది. డేట్ అనుకోగానే సతీష్ నాతో ఒక విషయం చెప్పాడు. శ్రావణమాసం అంటే తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్. ఈ నెలలోనే ఎక్కువ పెళ్లిళ్లు జరుగుతాయి. మనం ఆ జంటలకు పట్టు వస్త్రాలు ఇస్తే బాగుంటుంది అని సూచించాడు. ఈ విషయం నేను కళామందిర్ వారితో చెప్తే వారు కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. మేము కూడా మీకు సహకరిస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ మాసంలో పెళ్లి చేసుకుంటున్న జంటలు మీ వెడ్డింగ్ కార్డు మాకు ఫేస్బుక్ లో పంపిస్తే మీకు మేము పట్టు వస్త్రాలు పంపిస్తామని చెప్పారు దిల్ రాజు. కుదిరితే కొందరికి మా టీమ్ స్వయంగా వచ్చి వస్త్రాలు అందిస్తుంది అని తెలిపారు.