థియేట‌ర్ కార్మికుల జీతాలు యాజ‌మాన్యం మింగేసిందా?

లాక్ డౌన్ కార‌ణంగా రెండు నెల‌లుగా థియేట‌ర్లు మూత ప‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో థియేట‌ర్ యాజ‌మాన్యానికి రూపాయి ఆదాయం లేదు. అద‌నంంగా ప్ర‌భుత్వానికి మినిమం క‌రెంట్ బిల్లులు వ‌గైరా పే చేయాల్సిన ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో తెలంగాణ లో సినిమా థియేట‌ర్ల‌లో ప‌నిచేసే కార్మికులు లాక్ డౌన్ కాలంలో పూర్తి వేత‌నాలు చెల్లించాల‌ని థియేట‌ర్స్ ఎంప్లాయిస్ యూనియ‌న్( సిఐటియు) ఆధ్వ‌ర్యంలో నేడు నిర‌స‌న దీక్ష చేప‌ట్టారు. క‌రోనా కార‌ణంగా రెండు లాక్ డౌన్ విధించిన ప్ర‌భుత్వం ప‌నిచేసే కార్మికుల‌కి జీవో 45 ప్ర‌కారం య‌జ‌మానులు జీతాలు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఆ ప్ర‌కారం మార్చి, ఏప్రిల్, మే నెల‌ల జీతాలు చెల్లించాల‌ని డిమాండ్ చేసారు.

కానీ థియేట‌ర్ యాజ‌మాన్యాలు జీతాలు ఇవ్వ‌కుండా, అడిగితే బెదిరిస్తున్నార‌ని వాపోయారు. ప్ర‌భుత్వం ఇచ్చిన జీవోను లెక్క చేయ‌కుండా కార్మికుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని, త‌క్ష‌ణం యాజ‌మానుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుని..వారికి జీతాలు ఇప్పించాల్సిందిగా ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేసారు. అలాగే లాక్ డౌన్ కార‌ణంగా కార్మికుల‌ను ప‌నుల నుంచి తొల‌గిస్తున్నార‌ని, వారికి ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోరారు. ఇచ్చే జీతాల‌లో 40 నుంచి 50 శాతం కోత‌లు విధిస్తున్నా ర‌ని, ఈ కార‌ణంగా రెండు వేల కుటుంబాలు రోడ్డున ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని ప్ర‌భుత్వానికి తెలిపారు.

అలాగే కార్మికులకు నిత్యవసర సరుకులు, 7500 రూపాయలు అందించవలసిందిగా ప్ర‌భుత్వాన్ని కోరారు. అయితే ఇక్క‌డో కిరికిరి ఉంది. తెలుగు రాష్ర్టాల్లో చాలా థియేట‌ర్లు సినిమా నిర్మాత‌ల‌కు లీజ్ కు ఇచ్చేసారు. దాంతో థియేట‌ర్ బాధ్య‌త‌ల్ని నిర్మాత‌లే చూసుకుంటున్నారు. థియేట‌ర్ యాజ‌మాన్యం కేవ‌లం మెయింట‌నెన్స్ మాత్ర‌మే చేస్తుంది. ప్ర‌స్తుత కాలంలో థియేట‌ర్ యాజ‌మాన్యాన్ని ఆదుకునేది కూడా నిర్మాత‌లే. కాబ‌ట్టి థియేట‌ర్ మేనేజ్ మెంట్ ని నిర్మాత‌లు ఎప్పుడూ బాగానే చూసుకుంటారు. లాక్ డౌన్ కార‌ణంగా ఇబ్బందుల‌ను గుర్తించి నిర్మాత‌లే వాటిని ప‌రిష్క‌రించే ఉంటారు. అయితే కార్మికుల‌కు చెల్లించాల్సిన జీతాల్ని థియేట‌ర్ యాజ‌మాన్యాలు జేబులో వేసేసుకుని ఉంటారు? అన్న అనుమానం వ్య‌క్తం అవుతోంది.