టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా పెళ్లి ఫిక్సయిన సంగతి తెలిసిందే. ప్రఖ్యాత జువెలరీ డిజైనర్ కం బిజినెస్ మ్యాగ్నెట్ కుటుంబం నుంచి అమ్మాయిని ఎంపిక చేసుకున్నాడు. మిహీక బజాజ్ ని తనే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పరిచయం చేశాడు. ఇక ఇప్పటికే రోకా శిరోమణి (ఫ్యామిలీ మీట్) సైలెంటుగా కానిచ్చేశారు. త్వరలోనే నిశ్చితార్థం జరగనుందని సమాచారం. అదంతా సరే కానీ.. అసలు మిహీకతో రానాకు పరిచయం ఎలా? ఎప్పటి నుంచి పరిచయం ఉంది? అన్నది అతడినే అడిగేస్తే ఏమని చెప్పాడో తెలుసా?
`లాక్డ్ అప్ విత్ లక్ష్మి` షోలో `లక్ష్మి మంచు`తో జరిగిన ఒక సంభాషణలో.. రానా మిహీక గురించిన వివరాలను వెల్లడించారు. మిహీకాను ఎలా కలుసుకున్నావు? అని ప్రశ్నిస్తే.. “నాకు తను చాలా కాలంగా తెలుసు. ఎందుకంటే ఆమె అశ్రిత (వెంకటేష్ కుమార్తె) క్లాస్ మేట్“ అని తెలిపాడు. అయితే ఈ జంట ప్రేమలో పడేందుకు కొంత సమయం పట్టింది. రానా మొదట్లో మిహీకాపై ఎలాంటి ప్రేమ భావాలను పెంచుకోలేదు. చాలా కాలం తర్వాత ఆమెతో స్నేహం కుదిరాక.. ఒకరికొకరు ప్రేమానుభూతికి లోనయ్యారట. “సరైన సమయంలో సరైన వ్యక్తిని కలిసినప్పుడు మీరు ఆ వ్యక్తితో స్థిరపడాలని మీకు అనిపిస్తుంది. అదే నా విషయంలో జరిగింది. చాలా కాలం తర్వాత నేను మిహీకాను కలిసినప్పుడు, ఆమె నాకు బెటర్ హాఫ్ అని నేను భావించాను“ అని రానా తెలిపాడు.
అతడు మిహీకతో ప్రేమలో పడ్డానని అర్థమయ్యాక.. నేరుగా వెళ్లి తనకు ప్రపోజ్ చేయలేదట. తొలుత తన తల్లిదండ్రులను కలిసి ఉన్న విషయం చెప్పాడట. దాంతో వారు చాలా షాక్ అయ్యారని రానా చెప్పారు. మిహీక తల్లిదండ్రుల సమ్మతి తీసుకున్న తరువాతనే తనను సంప్రదించానని చెప్పాడు. రానా కెరీర్ సంగతి చూస్తే ఇప్పటికే వరుసగా నాలుగైదు భారీ చిత్రాలకు సన్నాహాలు చేస్తున్నాడు. `హాతి మేరే సాథీ` విడుదల కోసం వేచి చూస్తున్నాడు. OTT లో విడుదల చేయబోయే యానిమేషన్ షోని చేయబోతున్నాడట.