అక్కినేని, కమల్ హాసన్ రికార్డులు బద్దలుకొట్టనున్న చియాన్!

పాతిక గెటప్పులను విక్రమ్ ఎలా ప్రజెంట్ చేస్తాడో!

కమల్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నటుడిగా పెర్ఫార్మెన్స్‌తోనే కాదు, భిన్నమైన గెటప్పులతో అలరించడంలో హీరో చియాన్ విక్రమ్ కు సాటిలేరు. చేసినవి తక్కువ సినిమాలే అయినా .. ఆ సినిమాల ద్వారా సంపాదించిన క్రేజ్ మాత్రం కొండంత. పాత్రకు ప్రాణంపోసే కొద్దిమంది నటుల్లో విక్రమ్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. కొద్దిరోజుల క్రితం మిస్టర్ కెకెగా తన స్టయిల్‌ను చూపించిన చియాన్ ఆ సినిమాతో ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేదు.

ఆ మాటకొస్తే .. వైవిధ్యమైన కథలతో సినిమాలు చేయడమే తప్ప విక్రమ్ ఏ రోజూ బ్లాక్ బస్టర్ హిట్లు కోసం వెంపర్లాడలేదు కూడా. తాజాగా 58వ ప్రాజెక్టుని పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నాడట విక్రమ్. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించనున్న చిత్రంలో 50ఏళ్ల విక్రమ్ పాతిక గెటప్పుల్లో కనిపించనున్నాడన్నది కోలీవుడ్ వర్గాల మాట. చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకున్నా, ఇది నిర్థారణ అయిన సమాచారంగానే చెబుతున్నారు. అమెరికన్ కంపెనీ ఒకటి మేకప్, గెటప్, స్టయిల్ డిజైన్లను రెడీ చేస్తోందని అంటున్నారు. ఇదే నిజమైతే విక్రమ్ ఇంటర్నేషనల్ రికార్డు సృష్టించిన వాడే అవుతాడు.

ఎక్కువ గెటప్పులు వేయడం కొత్తకాకున్నా, ఇన్ని గెటప్పుల్లో కనిపించన హీరో అయితే లేడు. నవరాత్రిలో అక్కినేని నాగేశ్వర రావు తొమ్మిది పాత్రలుగా కనిపిస్తే, దశాతారం చిత్రంలో కమల్ పది పాత్రలు పోషించి తనకు తిరుగులేదని అనిపించుకున్నాడు. ఇప్పుడు విక్రమ్ 25 గెటప్‌ల్లో కనిపిస్తే … ఈ రికార్డును ఇప్పట్లో ఎవ్వరూ అధిగమించే అవకాశం కూడా ఉండదు.

సెవెన్ స్క్రీన్ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోలు సంయుక్తంగా నిర్మించనున్న సినిమా ఆగస్టు చివరి వారంలో సెట్స్‌పైకి వెళ్తోందట. ఏప్రిల్ 2020లో సినిమాను థియేటర్లకు తేవాలన్న ప్రణాళికతో ఉన్నారట. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సినిమా విడుదల కావొచ్చు. ఏ పాత్రనైనా కొత్తగా ప్రజెంట్ చేసే చియాన్ విక్రమ్ .. పాతిక గెటప్పులను ఎలా ప్రజెంట్ చేస్తాడోనన్న ఆసక్తి రేకెత్తుతోంది