తెలుగు తేజం అక్కినేని ని పొగడ్తలతో ముంచెత్తిన ప్రధానమంత్రి.. కృతజ్ఞతలు తెలిపిన నాగార్జున!

మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రస్తావించటం పట్ల నాగార్జున ప్రధానమంత్రి కి ధన్యవాదాలు తెలియజేశారు. తన తండ్రి శతజయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధానమంత్రికి ట్విట్ చేశారు నాగార్జున. ఐకానిక్ లెజెండ్స్ తో పాటు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతిని గౌరవించడం ఆనందంగా ఉందని నాగార్జున అన్నారు.

ఏఎన్ఆర్ దూరదృష్టి ఇండియన్ సినిమాలకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిపోతాయన్నారు.ప్రతినెల చివరి ఆదివారం ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. తాజా ఎపిసోడ్ లో ఏఎన్ఆర్, బాలీవుడ్ దర్శకుడు తపన్ సిన్హా, రాజ్ కపూర్ ప్రస్థానాన్ని గుర్తుచేసుకొని వారిని గురించి మోడీ కొనియాడారు. తెలుగు సినిమాని మరొక స్థాయికి తీసుకువెళ్లారని ఆయన సినిమాల్లో భారతీయ సాంప్రదాయాలు విలువలు చాలా చక్కగా చూపించే వారిని అన్నారు.

ఇక తపన్ సిన్హా సినిమాలు సమాజానికి కొత్త బాటలు వేసాయని, అలాగే రాజ్ కపూర్ సినిమాలో భారత దేశంలోనే సున్నితమైన అంశాలని ప్రపంచానికి పరిచయం చేశాయని చెప్పారు. భారతీయ చలనచిత్ర రంగం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని మోదీ అన్నారు. తొలిసారిగా వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమావేశాలని వచ్చే ఏడాది మనదేశంలోనే నిర్వహించబోతున్నామని కూడా తెలియజేశారు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ.

ఇదే విషయం పట్ల అక్కినేని నాగచైతన్య దంపతులు కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేశారు. కాగా ఈ ఏడాది ఏఎన్ఆర్ ఉత్సవాలు అని హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించారు నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులు. ఈ ఏడాది అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. ఈ వేడుకలలో బిగ్ బి అమితాబచ్చన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కినేని శతజయంతి ఉత్సవాల సందర్భంగా చివరిసారి అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడిన ఆడియోను కూడా ప్రదర్శించారు.