‘గ్యాప్.. ఇవ్వలేదు వచ్చింది’.. చిరంజీవికి కూడా అలాంటి పరిస్థితే!!

Megastar Chiranjeevi

గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది.. ఈ డైలాగ్ ఎంతగా సెన్సేషన్ అయిందో అందరికీ తెలిసిందే. మామూలుగా ఇది అల్లు అర్జున్ నిజ జీవితానికి వర్తించిన డైలాగ్ అయినా అల వైకుంఠపురములో సినిమాలో బాగా సెట్టైంది. నా పేరు సూర్య సినిమాపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకుని, అంతకు మించి కష్టపడితే ఫలితం బెడిసికొట్టింది. అందుకే కాస్త గ్యాప్ తరువాత వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇలాంటి పరిస్థితే ఒకప్పుడు చిరంజీవి కెరీర్‌లోనూ ఎదురైంది. మెగాస్టార్‌ గా తెలుగు చిత్ర సీమ సింహాసాన్ని అధిష్టించి రాజ్యమేలుతున్న కాలంలో గ్యాప్ వచ్చింది.

HBD Chiranjeevi
HBD Chiranjeevi

మెగాస్టార్ ‌గా మారి జగదేక వీరుడు అతిలోక సుందరి, యముడికి మొగుడు, ఘరానా మొగుడు, అత్తకు యుముడు అమ్మాయికు మొగుడు వంటి బ్లాక్ బస్టర్లతో దూసుకెళ్తున్న సమయంలో కొన్ని మిశ్రమ ఫలితాలను చవి చూశాడు. ఎస్పీ పరుశురామ్, బిగ్ బాస్, మెకానిక్ అల్లుడు, రిక్షావోడు వంటి సినిమాలతో చిరంజీవి కాస్త వెనక్కి తగ్గినట్టు అనిపించింది. అందుకే ఇక కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో రకరకాల కథలు వింటూ ఉండేవారట. కొత్త దనం ప్రయత్నించాలని అలా లెక్కలేనన్ని కథలు వింటూ ఉండగానే హిట్లర్ సినిమా ప్రస్థావన వచ్చిందట.

Chiranjeevi Hitler
Chiranjeevi Hitler

ఒరిజినల్‌గా మలయాలి చిత్రమైన హిట్లర్ కథ చిరంజీవికి బాగా నచ్చిందట. అయితే మన నేటివిటీకి తగ్గట్టు కథలో మార్పులు చేర్పులు తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా తీయగలిగే దర్శకుడి కోసం వేట ప్రారంభించారట. ఆ క్రమంలోనే సెంటిమెంట్‌ను బాగా ప్రజెంట్ చేసే ముత్యాల సుబ్బయ పేరు చర్చలోకి వచ్చిందట. ఇక ఆ ప్రాజెక్ట్‌ను ముత్యాల సుబ్బయ్య టేకప్ చేయడం, సరికొత్త మేకింగ్, పాటలు, డ్యాన్సులు, చిరు ఎమోషన్ సీన్స్ పండించడం ఇలా ప్రతీ ఒక్క అంశం కలిసి రావడంతో హిట్లర్ సినిమా చిరంజీవి కమ్ బ్యాక్‌గా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. హిట్లర్ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఓ సెన్సేషనే. ఆ డ్యాన్స్ మూమెంట్స్ ఎప్పటికీ ఓ చరిత్రే. ఎందుకంటే ఈ సినిమాతోనే లారెన్స్ కొరియోగ్రాఫర్‌గా అవతారమెత్తాడు. అలా చిరంజీవికి కూడా ‘గ్యాప్.. ఇవ్వలేదు వచ్చింది’ అనే పరిస్థితి ఎదురైంది.