సీతారామరాజుగా చరణ్‌.. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్

తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కతున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. రాజమౌళి, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు తెలియజేయడానికి చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి సినిమా కథా కథనాలు, నటీనటుల విశేషాలను వెల్లడించారు.

స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంలు ఒకే సమయంలో కలిసి పోరాటం చేసి ఉంటే ఎలా ఉండేది అన్న ఫిక్షనల్‌ పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా వెల్లడించారు రాజమౌళి. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌.. సీతా రామరాజుగా, ఎన్టీఆర్‌ కొమరం భీం కనిపించనున్నారు.

రాజమౌళి మాట్లాడుతూ..‘‘ఇలాంటి కథకు మాకు సహాయపాత్రలు కూడా భారీగానే ఉండాలి. మాకు అంతే భారీ తారాగణం ఉంది. అజయ్‌ దేవగణ్‌ సినిమాకు ఒప్పుకొన్నారు. ఆయన కీలక పాత్ర ఇచ్చాను. మెసేజ్‌ పెట్టగానే ఓకే అన్నారు. డేట్స్‌ ఎప్పుడు కావాలని అడిగారు. ఆయనకు పాత్ర చాలా నచ్చింది. ఆలియా భట్‌ చరణ్‌కు జోడీగా నటిస్తారు. ఆమె కూడా చాలా ఆత్రుతగా ఉన్నారు. ఏ పాత్రైనా చేస్తాను అన్నారు.
తారక్‌కు జోడీగా డైసీ అడ్గార్జియోన్స్‌ చేస్తున్నారు. సముద్రఖని కూడా ఉన్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నారు. వర్కింగ్‌ టైటిల్‌ ఆర్‌ ఆర్‌ ఆర్‌. కానీ డిస్ట్రిబ్యూటర్స్‌ నుంచి చాలా మంది ‘బాగుంది దాన్నే టైటిల్‌ పెట్టండి’ అంటున్నారు.

కానీ సినిమాకు అన్ని భాషల్లో ఆర్‌ ఆర్‌ ఆర్‌ అనే కామన్‌ టైటిల్‌ ఉంటుంది. టైటిల్‌ మాత్రం ఒక్కో భాషలో ఒక్కో విభిన్న టైటిల్‌ ఉంటుంది. అయితే టైటిల్‌ను మాత్రం ఇప్పుడే చెప్పలేను. అభిమానులనే టైటిల్‌ను గెస్‌ చేయమంటున్నాం. ఇప్పటికైతే టైటిల్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ అనే అనుకుంటున్నాం. సీతారామరాజు యువకుడిగా ఉన్నప్పటి పాత్రను రామ్‌చరణ్‌, కొమురం భీం పాత్రను తారక్‌ చేస్తారు.’’అని చెప్పుకొచ్చారు.