మొత్తానికి చంద్రబాబు నాయుడు ధైర్యం చేసి తెలంగాణా ఎన్నికల్లో ప్రచారానికి వస్తున్నారు. ఈరోజు ఖమ్మం, గ్రేటర్ హైదరాబాద్ లో జరిగే బహిరంగసభలు, రోడ్డుషోల్లో పాల్గొంటున్నారు. తెలంగాణా ఎన్నికల్లో ప్రచారానికి వస్తారా రారా అన్నది ఇంత కాలం సస్పెన్పుగా ఉండేది. ఎందుకంటే, మొన్న మేడ్చెల్లో జరిగిన సోనియాగాంధి, రాహూల్ గాంధి బహిరంగసభకు కూడా హాజరు కాలేదు. దాంతో అనుమానాలు మరింతగా పెరిగిపోయింది. అయితే, ఏఐసిసి అధ్యక్షుడు రాహూల్ తో కలిసి ప్రచారంలో పాల్గొనేందుకు వస్తున్నట్లు చెప్పటంతో టిడిపి నేతల్లో జోష్ కనబడుతోంది.
రాహూల్ తో కలిసి ఎన్నికల వేదికను పంచుకోవటం ఇదే ప్రధమం. మొన్న కర్నాటకలో ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారనుకోండి అది వేరే సంగతి. ఈరోజు మధ్యాహ్నం ఖమ్మం డిగ్రీ కళాశాలలో జరిగే బహిరంగ సభలో రాహూల్ తో కలిసి చంద్రబాబు కూడా పాల్గొంటున్నారు. వారిద్దరి మొదటి కలయికకు ఖమ్మం వేదిక కానుంది. ఖమ్మమే ఎందుకంటే భూభాగం ప్రకారం ఈ జిల్లా అవటానికి తెలంగాణాలోదే అయినా వాతావరణం మొత్తం ఆంధ్రాలాగే కనిపిస్తుంది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో తెలంగాణా ప్రభావం కనిపించదు. ఇక ఖమ్మంలో బహిరంగ సభ తర్వాత సాయంత్రం గ్రేటర్ హైదరాబాద్ లో పాల్గొంటారు. గ్రేటర్ పరిధిలోని సనత్ నగర్, నాంపల్లి నియోజకవర్గాల్లో జరిగే బహిరంగసభల్లో పాల్గొంటున్నారు.
ఓటుకునోటు కేసులో ఇరుక్కున్న దగ్గర నుండి తెలంగాణాలోకి అడుగుపెట్టటానికే చంద్రబాబు భయపడిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ కేసులో నుండి అరెస్టు తప్పించుకోవటానికే చంద్రబాబు రాత్రికి రాత్రే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను వదిలేసి విజయవాడకు పారిపోయారు. అప్పటి నుండి ఏదో ఎన్టీయార్ ట్రస్ట్ భవన్లో పార్టీ సమావేశానికో లేకపోతే ఏదైనా అత్యవసర కార్యక్రమానికి మాత్రమే పరిమితమైపోయారు. అంతకుమించి తెలంగాణాలో ఎక్కడ తిరగటం లేదు. ఆమధ్య జరిగిన పాలిట్ బ్యూరో సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణా ఎన్నికల్లో తాను ప్రచారానికి కూడా వచ్చేది లేదని స్పష్టంగా చెప్పేశారు. అయితే, మారిన పరిస్ధితుల కారణంగా హఠాత్తుగా నిర్ణయం మార్చుకుని ఇప్పటికైతే మూడు బహిరంగభల్లో పాల్గొంటున్నారు. తర్వాత సంగతి తర్వాత చూద్దాం ఏమవుతుందో.