ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండూ రాష్ట్రాలూ తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్ళు.. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలూ సినీ పరిశ్రమకు సహకరిస్తున్నాయ్.. కొందరు వ్యక్తులు చేసే వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం.. అంటూ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టతనిచ్చింది. ఛాంబర్ అధ్యక్షుడు నారాయణ్ దాస్ కాలిదాస్ నారంగ్ పేరుతో ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది ఛాంబర్. అయితే, 2020 మార్చి నుంచి తెలుగు సినీ పరిశ్రమలో అన్ని విభాగాలూ సమస్యలు ఎదుర్కొంటున్నాయని ఆ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వాల నుంచి మరింత సహకారాన్ని ఆశిస్తున్నామని కూడా ఛాంబర్ వెల్లడించింది. ఇటీవల ఛాంబర్ తరఫున, ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానిని కలిసి తమ సమస్యల గురించి వివరించామనీ, ఆ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారనీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా, పరిశ్రమకు సహకారం అందించే విషయంలో చిత్తశుద్ధితో వున్నారని ఛాంబర్ విడుదల చేసిన లేఖలో పేర్కొనడం గమనార్హం.
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. నిన్న ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా, రాజకీయ పరమైన విమర్శలు చేసిన విషయం విదితమే. సినిమా పరిశ్రమలోనివారూ స్పందించాల్సిందిగా పవన్ కళ్యాణ్ నినదించడం, పరిశ్రమ సమస్యల్ని పవన్ ఏకరువు పెట్టడంతో వివాదం ముదిరి పాకాన పడింది. అయితే, తెలుగు సినీ పరిశ్రమ నుంచి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మద్దతు తెలిపినవారిలో నాని, బ్రహ్మాజీ, కార్తికేయ తదితరులు మాత్రమే వున్నారు. వీళ్ళు కూడా, కేవలం సినిమా పరిశ్రమ సమస్యల విషయంలోనే పవన్ వ్యాఖ్యల్ని సమర్థించారు. మెగా కాంపౌండ్ నుంచి ఇంతవరకూ ఎవరూ పవన్ కళ్యాణ్‌ని సమర్థించకపోవడం గమనార్హం.