ఈసారి లీకుల్లేకుండా ఆ ఒక్కటీ కట్
స్టార్ మాలో బిగ్ బాస్ మూడు సీజన్లు సక్సెసయ్యాయి. బిగ్ బాస్ సీజన్ 4 త్వరలో స్టార్ మాలో ప్రసారం కానుంది. నాగార్జున ఇప్పటికే బిగ్ బాస్ ప్రోమో చిత్రీకరణలో పాల్గొన్నారు. త్వరలోనే ఇది రిలీజ్ కానుందట. ఈ నెల చివరి నాటికి ఈ సీజన్ ప్రారంభిస్తారు.ఈసారి పోటీదారుల పేర్లు రహస్యంగా ఉంచి హైప్ ని పెంచుతున్నారు. స్టార్ మా నెట్‌వర్క్ హోస్ట్ సహా పోటీదారుల భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. మహమ్మారీ సోకకుండా చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
ఈ సీజన్‌లో నాగార్జున వేదికపైకి వెళ్లరని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. వారాంతపు ఎపిసోడ్ల కోసం బయటి వ్యక్తులను ప్రేక్షకులుగా అనుమతించరని సమాచారం. కోవిడ్ వల్ల టీమ్ కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూడనున్నారు. అందుకే ఈసారి బయటి వ్యక్తుల్ని స్కిప్ చేస్తున్నారట. నాగార్జున తన వారాంతపు ప్రదర్శనను క్లోజ్డ్ సెట్‌లో పని చేస్తారు. సాంకేతిక బృందం తప్ప ఎవరినీ లోనికి అనుమతించరు.
దీంతో ఎలిమినేషన్ విషయమై లీకులు ఉండవని అంచనా వేస్తున్నారు. ఇది కలిసొచ్చే విషయమేనని స్టార్ మా భావిస్తోందట. ఇకపై శనివారం వారాంతపు ఎపిసోడ్‌లను చిత్రీకరించేప్పుడు జనం ఉండరు. ఇంతకుముందు శని, ఆదివారం రెండు భాగాలుగా ప్రసారం చేయడం వలన ఎవరు ఎలిమినేట్ అయ్యారనే సస్పెన్స్ ఉండేది.
కానీ ఈసారి అలా కాదు. బయటివారికి అనుమతి లేకపోవడంతో, ఈ సీజన్ ఆ అంశంలో సస్పెన్స్‌ను కొనసాగించే వీలుంటుంది. తద్వారా ఇది రెట్టింపు ఆకర్షణను పెంచనుంది. ఈ సీజన్ తక్కువ సంఖ్యలో ఇంటి సభ్యులతోనే లాగించేస్తారట. ఇదంతా కరోనా మాయ. హోస్ట్ సహా ఇంటి సభ్యుల సంక్షేమం కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు అలా ఉన్నాయి మరి.