మాస్ ఇమేజ్ కోసం పోరాడుతున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రూట్ మార్చి కంటెంట్ బేసెడ్ చిత్రం చేసారు. ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టైటిల్ సీత . షూటింగ్ పూర్తై రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాలో టైటిల్ రోల్‌లో సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రిలీజ్ దగ్గర పడుతూండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. అందులో భాగంగా శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఫైటింగ్, యాక్సిడెంట్ సీన్ తో ట్రైలర్ మొదలైంది. ‘నా పేరు సీత నేను గీసిందే గీత. ప్రాస బాగుంది కదా..’ అని కాజల్ అంటూంటే.. ‘ఇది కంచుకే కంచులా ఉందిరా బాబూ..’ అంటూ తనికెళ్ల భరణి వణికిపోతూ అనడంతో ఆమె పాత్రను ఎస్టాబ్లిష్ చేసారు.
ఇందులో రామ్ (బెల్లంకొండ శ్రీనివాస్) అమాయకత్వం మూర్తిభవించిన కుర్రాడిగా కనిపిస్తాడు. స్వాతిముత్యం లాంటి అతన్ని సీతే (కాజల్) దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. చాలా కాలం తర్వాత సోనూ సూద్ విలన్ పాత్ర పోషించారు. ‘రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లడం తప్పు కాదండి. రాముడి భార్యను ఎత్తుకెళ్లడం తప్పు’ అని ట్రైలర్ చివర్లో శ్రీనివాస్ చెబుతున్న డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఇందులో మన్నారా చోప్రా మరో హీరోయిన్ గా నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. మే 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.