“చిలక కొట్టుడు కొడితే చిన్నదానా
పలకమారి పోతావే పడుచుదానా
రాటుదేలి పోయావు నీటుగాడా – నీ
నాటు సరసం చాలులే పోటుగాడా”
అంటూ సాగే పాట ఎంత పెద్ద హిట్టో తెలియంది కాదు. 1977 లో వచ్చిన యమగోల లో ఈ పాట పెద్ద హిట్టైంది. ఇప్పుడీ పాట ని ఎన్టీఆర్ బయోపిక్ లో మళ్లీ చూడవచ్చు. ఈ విషయాన్ని తాజాగా పోస్టర్ వదిలి చిత్రం యూనిట్ తెలియచేసింది. ఈ పాటలో ఎన్టీఆర్ లా బాలకృష్ణ, జయప్రదలా హన్సిక కనిపించనున్నారు. కాస్ట్యూమ్స్, లుక్ మొత్తం రీక్రియేట్ చేసారు.
సొంత బ్యానర్ ఎన్‌బీకె ఫిలిమ్స్ బ్యానర్‌పై తానే లీడ్ రోల్ పోషిస్తూ బాలకృష్ణ చేస్తున్న చిత్రం ఇది. ఎన్టీఆర్ జీవితాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు భాగాలుగా చిత్రీకరించారు. ఎన్టీఆర్ సినీ జీవితాన్ని మొదటిభాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో, రాజకీయ జీవితాన్ని ‘ఎన్టీఆర్ మహానాయకుడు’లో పొందుపరిచారు.
అయితే సంక్రాంతి కానుకగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ జనవరి 9వ తేదీన విడుదల చేస్తోంది చిత్రయూనిట్.
బాలకృష్ణ మాట్లాడుతూ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, సినీనటుడు అన్న ఎన్‌టిఆర్ జీవిత చరిత్రను నేటి తరానికి తెలియజేసేందుకు కధానాయకుడు, మహానాయకుడు రెండు చిత్రాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. కధానాయకుడు చిత్రం నిర్మాణం పూర్తి అయిందని, ఈ నెల 9న ఆ చిత్రం విడుదల అవుతుందన్నారు.
మహానాయకుడు చిత్రం నిర్మాణం జరుగుతోందని 10 రోజుల్లో ఆ చిత్రం నిర్మాణం కూడా పూర్తి అవుతుందన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ఒక పార్టీకిగానీ, ఒక వర్గానికి పరిమితం కాదని, ఎన్టీఆర్ అందరూ ఆదరించే మహానాయకుడు అని ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.