ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా తెరకెక్క బోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం ప్రొడక్షన్ కార్య క్రమాలు ప్రారంభమయ్యాయి. వినయ విధేయరామ నుంచి కోలుకున్న బోయపాటి పూర్తిగా ఈ పనిలో పడిపోయారు. ఫిబ్రవరి ధర్డ్ వీక్ లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది.
కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించనున్నారట. అందులో ఒక పాత్ర ముఖ్యమంత్రి క్యారక్టర్ అని తెలుస్తోంది. సీఎంగా బాలయ్య తీసుకునే నిర్ణయాలు చాలా బాగుంటాయని, బోయపాటి తనస్టైల్ లో వాటిని చాలా ఎమోషనల్ గా యాక్షన్ ఓరియెంటెడ్ గా తీర్చిదిద్దాడంటున్నారు. ముఖ్యమంత్రిగా బాలయ్య గెటప్ గౌరవనీయంగా, రాజకీయ నాయకులకు చాలా ప్రేరణ కలిగించే విధంగా ఉంటాయని సమాచారం.
పైగా ఈ చిత్రంలోని చాలా భాగం రాజకీయ నేపథ్యంలో సాగనుందట. రాజకీయాలతో పాటు సమాజంలోని కుళ్ళును ప్రశ్నించి విధంగా ఈ స్క్రిప్ట్ ఉంటుందట. వచ్చే ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ స్క్రిప్టు రెడీ చేసాడంటున్నారు. అప్పట్లో లెజండ్ చిత్రం ఎలక్షన్స్ కు ఉపయోగపడినట్లే..ఇప్పుడీ చిత్రం సైతం తెలుగుదేశం పార్టికి ఉపయోపగపడే విధంగా డైలాగులు రెడీ చేయిస్తున్నట్లు సమాచారం.
అలాగే ఈ చిత్రం తొలి షెడ్యూల్ లోనే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల ఆద్వర్యంలో యాక్షన్ సన్నివేశాలను తీయనున్నాడు. గతంలో బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహ , లెజెండ్’ చిత్రాలు ఒకదానిని మించి ఒకటి హిట్ అవ్వడంతో ఈ కొత్త చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి వీరిద్దరికి ఈ చిత్రం హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి. మరో ప్రక్క బాలయ్య మహానాయకుడు లోనూ తన తండ్రి పాత్రలో ముఖ్యమంత్రిగా కనిపించబోతున్న విషయం తెలిసిందే.