మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ నటసింహా నందమూరి బాలకృష్ణ ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. మెగాబ్రదర్ నాగబాబు ఎంట్రీతో మెగా – నందమూరి రచ్చ పీక్స్ కి చేరుకుంది. పరిశ్రమ పెద్దగా చిరంజీవి ఒక్కరే చక్రం తిప్పుతున్నారన్న అక్కసును బాలయ్య బహిరంగంగానే వ్యక్తం చేయగా.. దానికి ఒక సెక్షన్ మీడియా .. ఇండస్ట్రీలో ఒక సెక్షన్ ఫ్యాన్స్ సపోర్టు చేశారు. బాలయ్యను పక్కన పెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని చిరంజీవి బృందం కలిసి ఉండాల్సింది కాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. పరిశ్రమ బాగోగుల విషయంలో ఏదైనా చేయదలిస్తే ఇక్కడ ఒకానొక మూలస్థంబంగా ఉన్న బాలయ్యను కూడా పిలవాల్సింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే చిరంజీవి పెద్దరికంపై ఊహించని కామెంట్ చేసి బాలయ్య హాట్ టాపిక్ అయ్యారు. పెద్దలంతా కలిసి భూములు పంచుకోవడానికే! అంటూ వ్యాఖ్యానించి అసలు సంబంధం లేని ఏదేదో మాట్లాడడంతో అది కాస్తా హాట్ టాపిక్ అయ్యింది. తెలంగాణ ప్రభుత్వంతో చిరంజీవి భేటీ బాలయ్యకు ఏమాత్రం నచ్చలేదని అందరికీ అర్థమైంది. అయితే చిరు ఇవేవీ పట్టనట్టు తన పనేదో తాను చేసుకుపోయారు. అయితే ఇండస్ట్రీలో నువ్వు కింగ్ వి కావు.. ఆ అర్హత నీకు లేదు! అంటూ నాగబాబు బాలయ్యపై విరుచుకుపడడం.. అటుపై మా అసోసియేషన్ భవంతి పేరుతో ఐదు కోట్ల నిధి సేకరించారు గా! అంటూ బాలయ్య కెలకడంతో అది కాస్తా తీవ్రంగా చర్చకొచ్చింది. మొత్తానికి ఈ వైరానికి చెక్ పడిపోయేదెపుడు? అంటే దానికి సరైన క్లారిటీ లేదు ఇప్పటికీ. అయితే మెగా వర్సెస్ నందమూరి వార్ మాత్రం అంతకంతకు పెరిగే ఛాన్సే కనిపిస్తోంది కానీ పరిష్కారం కనిపించడం లేదని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈనెల 10న నందమూరి బాలకృష్ణ 60వ బర్త్ డే. ఆరోజు ఘనంగా షష్ఠిపూర్తి చేయాలని కుటుంబసభ్యులు ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ అలాంటి కీలక వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానిస్తారా? ఒకవేళ బాలయ్య పిలిస్తే ఎలాంటి భేషజం లేకుండా చిరు ఎటెండవుతారా? అన్న చర్చా మొదలైంది. ఇన్నాళ్ల బాహాబాహీకి అలా ఫుల్ స్టాప్ పెట్టేందుకు వీలుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే అంత ఇంపార్టెంట్ వేడుకకు టి.సుబ్బరామిరెడ్డి లాంటి ప్రముఖుడు ఎటెండవుతారు కాబట్టి చిరు- బాలయ్యను కలిపేసే వీలుందని అభిమానులు భావిస్తున్నారు. ఏం జరగనుందో చూడాలి.