తారక్‌ తో ఒకటి, విజయ్‌ దేవరకొండతో రెండు సినిమాలు కమిటయ్యాం

ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ అధినేత‌ నిర్మాత అశ్వినీ ద‌త్ చ‌ల‌సాని నిర్మాత‌గా రూపొందుతోన్న మ‌రో చిత్రం `దేవ‌దాస్‌`. సెప్టెంబ‌ర్ 27న ఆడియో విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో నిర్మాత అశ్వినీద‌త్ చ‌ల‌సాని ఇంట‌ర్వ్యూ..

 

రిటైర్ అవుతాను…

– నిర్మాత‌గా మా సంస్థ‌ను స్థాపించి 45 సంవ‌త్స‌రాలు అవుతుంది. ఇన్నేళ్ల‌లో 51 చిత్రాలు నిర్మించాను. `దేవ‌దాస్` 52వ చిత్రం . ‘మహానటి’ విజయం తర్వాత ఈ సినిమా వస్తుండటం సంతోషంగా ఉంది. 20న ఏయన్నార్‌గారి జయంతి సందర్భంగా పాటల్ని, 27న చిత్రం విడుదల చేస్తున్నా.  ఏదో ఒక రోజు నిర్మాతగా రిటైర్‌ అవుతున్నానని చెప్పేస్తా. అందుకు ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు. ఎందుకంటే మా అమ్మాయిలు స్వప్న, ప్రియాంక చాలా స్ట్రాంగ్‌గా వెళ్తున్నారు. అందుకని నేను రిటైరయ్యే రోజు కోసం ఎదురుచూస్తున్నా.

 

కోటీశ్వ‌రుడ్ని అయ్యేవాడ్ని…

– అప్పట్లో (1973లో) మా నాన్నగారిని అడిగి మద్రాస్‌ తీసుకువెళ్లిన డబ్బులను టీ నగర్‌లో ఇన్వెస్ట్‌ చేసుంటే కోట్లాదిపతి అయ్యుండేవాణ్ణి. కొన్నిటిని డబ్బుల పరంగా చూసుకోకూడదు. ఇప్పటి హీరోల తండ్రులతో తీశా. తాతలతో తీశా. తాతల మనవళ్లతో తీస్తున్నా. ఇంకా తీస్తాను.నేను ఇండస్ట్రీలో 45 ఏళ్లు ఉన్నా. మరో 55 ఏళ్లు వైజయంతి సంస్థ నడుస్తుంది. మా పిల్లలు సంస్థను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తారు.

 

శ్రీమ‌తి ప్రోత్సాహం ఎంతో…

– నేను నిర్మాత‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన రోజుల్లో నిర్మాత‌గా ఒక‌ట్రెండు దెబ్బ‌లు త‌గిలినా.. మ‌న‌మే మ‌ళ్లీ మంచి సినిమాలు తీయాల‌ని నా శ్రీమ‌తి నన్ను ప్రోత్స‌హించింది.  పిల్లలు అమెరికాలో చదువుకుని వచ్చాక… ఇదే రంగాన్ని ఎంచుకోవడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఇత‌ర భాష‌ల్లో సినిమాల నిర్మాణం…

– తెలుగులో కాకుండా భవిష్యత్తుల్లో స్వప్న, ప్రియాంక నాయకత్వంలో వైజయంతి సంస్థ వివిధ భాషల్లో చిత్రాలు నిర్మించాలని నా చిరకాల కోరిక. గ‌తంలో  ‘కలకత్తా మెయిల్‌, కంపెనీ చిత్రాల తర్వాత హిందీలో చిత్రాలు నిర్మించలేదు. ఇప్పుడు నాగ అశ్విన్‌ హిందీ, తెలుగు చిత్రాలు చేయాలని ఆసక్తిగా ఉన్నాడు. అందుకని, హిందీ పరిశ్రమలోనూ అడుగుపెట్టాలనే ఉద్దేశంతో వయాకామ్‌ సంస్థను పార్టనర్స్‌గా చేసుకున్నాం. తమిళంలోనూ చిత్రాలు నిర్మించాలని ఉంది. వైజయంతి సంస్థను మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళ్లాలని స్వప్న, ప్రియాంక ఆశ. నా పిల్ల‌లు నా సంస్థ‌ను వందేళ్లు తీసుకెళ‌తార‌నే న‌మ్మ‌కం ఉంది. 

 

దేవ‌దాస్ ఎలా రూపొందింది?

– రచయిత శ్రీధర్‌ రాఘవన్‌ మాకు ఎప్పటినుంచో మంచి మిత్రుడు. ఆయన చిన్న బేస్‌ స్టోరీని భూపతిరాజా చక్కటి కథగా మలిచాడు. సత్యానంద్‌గారి పర్యవేక్షణలో, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం శ్రీరామ్‌ ఆదిత్య సిద్ధం చేశాడు. శ్రీరామ్ చ‌దువుకున్న‌వాడు.. సినిమాల‌పై మంచి నాలెడ్జ్ ఉంది. అంత‌కుముందే `భ‌లేమంచిరోజు`, `శ‌మంత‌క‌మ‌ణి` సినిమాలు చేశాడు. `శ‌మంత‌క‌మ‌ణి` సినిమా స‌మ‌యంలో శ్రీరామ్ ఆదిత్య అయితే మా క‌థ‌ను బాగా డీల్ చేస్తార‌నిపిస్తుంది. ఇద్ద‌రూ భిన్న‌మైన మ‌న‌స్త‌త్వాలు ఉన్న వ్య‌క్తుల ప్ర‌యాణం.  ఫ్రెండ్‌షిప్ గురించి నిర్వ‌చ‌నం ఇచ్చే చిత్రం.  

 

మ‌ణిశ‌ర్మ సంగీతం గురించి..?

– మా బ్యాన‌ర్‌లో రూపొందిన `చూడాల‌ని ఉంది` సినిమాతో మ‌ణిశ‌ర్మ‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం చేశాను. మా బ్యాన‌ర్‌లో త‌ను 16 సినిమాలు చేశాడు. `దేవ‌దాస్‌` త‌న‌కు 17వ సినిమా. త‌ను కూడా ఈ మ‌ధ్య క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు దూరంగా ఉన్నాడు. ఈ సినిమాతో మ‌రోసారి విశ్వ‌రూపం చూపిస్తాడు. 

 

నాగార్జున‌,నానిల‌ను ఎలా ఒప్పించారు?

– శ్రీధర్‌ రాఘవన్‌ లైన్‌ సెలక్ట్‌ చేశాక… నాగార్జున, నానీలకు వినిపించాం. ఇద్దరికీ నచ్చింది.  నాని దర్శకత్వ విభాగం చేశాడు కనుక స్ర్కిప్ట్‌ డిస్కషన్స్‌లో అతని ఇన్వాల్వ్‌మెంట్‌ బావుంటుంది. ‘ఎవడే సుబ్రమణ్యం’ టైమ్‌లో చూశాను కూడా! అయితే… నాకు బాగా ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, నాగార్జునగారి ఇన్వాల్‌మెంట్‌. చాలా క‌మాండింగ్‌గా సినిమా చేశారు. మా బ్యాన‌ర్‌లో నాగార్జున‌గారితో చేసిన ఐదో చిత్ర‌మిది. 

 

ద‌ర్శ‌క‌త్వం చేయ‌ను..

– ఎవ‌రి ప‌ని వారు చేస్తేనే మంచిది. ద‌ర్శ‌కుల ప‌ని ద‌ర్శ‌కులే చేయాలి. చక్కగా అన్నం ఉడికిన తర్వాత ‘ఇందులో ఇది ఉంది.. అందులో అది లేదు’ అని చెప్పడంలో నాకు ఆనందం ఉంది. నిర్మాతగా అక్కడే జడ్జ్‌మెంట్‌ ఉంటుంది. 

 

త‌దుప‌రి చిత్రాలు…

– తమిళ దర్శకుడు అట్లీతో జనవరి లేదా ఫిబ్రవరి నుంచి ఓ సినిమా చేస్తాం. తారక్‌ (జూనియర్‌ ఎన్టీఆర్‌)తో ఒకటి, విజయ్‌ దేవరకొండతో రెండు సినిమాలు కమిటయ్యాం. విజయ్‌ దేవరకొండతో తీయబోయే మొదటి చిత్రానికి రాజ్‌–డీకే దర్శకత్వం వహిస్తారు. నాగి (నాగ అశ్విన్‌) కథ రాస్తున్నాడు. రెండుమూడు నెలల్లో ఆ సినిమా వివరాలు ప్రకటిస్తా. నాగి (నాగ అశ్విన్‌) కథ రాయడం ప్రారంభించారు. దాన్ని ఎటువైపు తీసుకువెళ్లాలనేది నాకూ తెలియడం లేదు. కాకపోతే.. ఆ సినిమా భారీగా ఉంటుంది. ‘చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని ఆ కథ సిద్ధం చేయడం లేదా?’ అని ప్రశ్నిస్తే… ‘‘నేను అనుకోవడం లేదు సార్‌! నాగి ఒక స్టేజిలో చెప్పినప్పుడు… చిరంజీవిగారికి యాప్ట్‌గా వుంటుందని అనుకున్నాను. అతను కూడా అప్పట్లో అదే ఫీలయ్యాడు. డెవలప్‌మెంట్స్‌లో అది ఎలా వెళ్తుంది? ఏంటి? అనేది ఇప్పుడే చెప్పలేం. అదీ కాకుండా… కథ ఒక షేప్‌కి వచ్చాక, చిరంజీవిగారికి వినిపించాలి. ఆయన, దర్శకుడు ఇష్టపడితేనే కదా? సినిమా పట్టాలు ఎక్కుతుంది.