బెల్లంకొండ పై కేసు పెట్టిన టీవి చానెల్, అరెస్ట్‌ వారెంట్‌

బెల్లంకొండ పై కేసు పెట్టిన టీవి చానెల్, అరెస్ట్‌ వారెంట్‌

ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. తమకు చెల్లించాల్సిన రూ.3.5 కోట్లను తిరిగి ఇవ్వటంలో విఫలమయ్యారని బాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ కోర్టును ఆశ్రయించగా ఈ మేరకు అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేసింది. రేపు తన కుమారుడు నటించిన రాక్షసుడు సినిమా రిలీజ్ హడావిడిలో ఉన్న ఆయనకు ఇది పెద్ద దెబ్బే. ఇంతకీ బెల్లంకొండకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయటానికి కారణమేంటి..

గతంలో యష్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మించిన ‘బాండ్‌ బాజా బరాత్‌’ సినిమా హిందీలో సూపర్ హిట్. ఆ కథనే కొంచెం అంటూ ఇటూ చేసి సిద్ధార్థ్‌, సమంత హీరో హీరోయిన్లుగా జబర్దస్‌ అనే సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఈ సినిమాలో 19 సీన్లు కాపీ చేశారని ఆరోపిస్తూ యష్‌రాజ్‌ ఫిలింస్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం సినిమా షోలను నిలిపేసింది. అయితే అప్పటితో ఆ కథ అవ్వలేదు.

అయితే జబర్దస్త్‌ సినిమా నిర్మాణంలో ఉండగానే టెలివిజన్‌ శాటిలైట్‌ టెలీకాస్ట్‌ రైట్స్‌ను రూ.3.5 కోట్లకు ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్‌ విక్రయించారు. యష్‌రాజ్‌ ఫిలింస్‌ ఫిర్యాదు మేరకు సినిమా షో నిలిపేయటంతో పాటు టెలివిజన్‌లోనూ టెలికాస్ట్‌ చేయవద్దని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సదరు టీవీ ఛానెల్‌కు ఆ మొత్తాన్ని బెల్లంకొండ సురేష్‌ తిరిగి చెల్లించాల్సి ఉంది. అయితే ఆ డబ్బుని ఇప్పటికి బెల్లంకొండ వెనక్కి చెల్లించలేదు.

డబ్బు కట్టకుండా కాలయాపన చేస్తుండటంతో ఛానెల్‌ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. అయితే బెల్లంకొండ తీసుకున్న రూ.3.5 కోట్ల మొత్తం వడ్డితో కలిపి ప్రస్తుతం రూ.11.75 కోట్లకు చేరింది. ఈ మేరకు కోర్టు బెల్లంకొండపై అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేసింది. ఛానెల్ తో కూర్చిని సెటిల్మెంట్ చేసుకుంటేనే ఈ సమస్య ఓ కొలిక్కి వస్తుందంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.