టీవీ ఛానెల్స్ లో తనదైన శైలి పోగ్రామ్ లతో సందడి చేయడంలో సుమ స్టైలే వేరు. ఆమెకి ఆంధ్రప్రదేశ్ లోనే కాదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్ళందరి ఇళ్లల్లోనూ అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా సినిమా పోగ్రామ్ లను హోస్ట్ చేయడంలోనూ ఆమె కు తిరుగే లేదు. ఎంతటివారినైనా కూడా తన మాట తీరుతో కట్టి పడేస్తుంటుంది. స్టేజీలపై స్పాటినిటితో జోక్స్ వేస్తూ నవ్వులు కురిపించే ఆమె తాజాగా సన్‌రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ కెప్టెన్, ఆస్ట్రేలియాకి చెందిన క్రికెట్ ఆటగాడు డేవిడ్ వార్నర్‌తో కలిసి వున్న ఓ ఫొటో ఆన్‌లైన్‌లో సందడి చేస్తోంది.
హైదరాబాద్ వంటకాల రుచి చూపించే పనిలో సుమ ఉన్నట్టు… ఆ వంటకాన్ని ఎప్పుడెప్పుడు ఆస్వాదిద్దామా అన్నట్టుగా వార్నర్ ఆ ఫొటోలో కనిపిస్తున్నారు. మరి దీని వెనకాల విషయమేంటన్నదే ఆసక్తికరంగా మారింది. సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ జట్టు కోసం వార్నర్‌తో కలిసి సుమ ప్రకటన చేసిందా? ఆ సందర్భంలో తీసిన ఫొటోనేనా ఇది, లేక ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పటి ఫొటోనా అన్నది తెలియాల్సి ఉంది. కానీ ఈ ఫొటోని మాత్రం నెటిజన్లు ఆసక్తిగా తిలకిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఇంతకీ ఎక్కడిదీ ఫొటో అంటే.. తెనాలి డబుల్ హార్స్ మినప గుండ్లు – సరికత్త టీవీసీ ప్రకటనల్లో సుమ నటిస్తున్నారు. ఇందులో ఆస్ట్రేలియన్ క్రికెటర్ వార్నర్ తో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు సంప్రదాయ వంటకాలైన మినప గారెలు, వడలను ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు వార్నర్ కు రుచిచూపించింది. భువనేశ్వర్ కుమార్ కూడా ఈ యాడ్ లో భాగంగా రుచికరమైన వంటకాలను టేస్ట్ చేశాడు.
సన్ రైజర్స్ టీమ్ కు మార్గదర్శిగా వ్యవహరిస్తున్న మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ సైతం ఈ వాణిజ్య ప్రకటన చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను సుమ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేయగా అభిమానులు విపరీతంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 23 నుంచి ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 12 వ టోర్నమెంట్ మొదలు కానుంది.