‘స్టార్’ సినిమాలు ఇంకా ఇంతేనా! (విశ్లేషణ)

2018 లో స్టార్ సినిమాలకి స్టార్ లేకుండా పోయింది. 27 స్టార్ సినిమాలు విడుదలైతే 5 మాత్రమే హిట్టయ్యాయి. ఈ సంవత్సరం కూడా స్టార్ సినిమాలు కమర్షియల్ ముసుగేసుకున్న ఆర్ట్ సినిమాలుగా కొనసాగాయి. తీస్తున్న స్క్రీన్ ప్లేలు కమర్షియల్ సినిమాలకి పనికి రాని ఆర్ట్ సినిమాలని ఇంకా తెలుసుకోకుండానే స్టార్ సినిమాలు తీసేస్తున్నారు. కమర్షియల్ సినిమా అనుకుంటూ ఆర్ట్ సినిమా స్క్రీన్ ప్లేలు రాసేసుకుంటున్నారు. ఫలితంగా ఒక్కో సినిమా మీద పదుల కోట్ల రూపాయలు, మొత్తం అన్ని సినిమాల మీదా వందల కోట్ల రూపాయలూ కోల్పోతున్నారు.

ఈ ఆర్ట్ సినిమాల స్క్రీన్ ప్లేలు కూడా మార్పు లేని ఒకే టెంప్లెట్ లో, ఒకే మూస కథనాలతో వుంటున్నాయి. వీటి బండారం మాస్ ప్రేక్షకులకి కూడా తెలిసిపోయి తిప్పి కొడుతున్నారు. పైగా కమర్షియల్ సినిమాలు కాని వరల్డ్ మూవీస్ ని కూడా తెచ్చుకుని కాపీకొట్టి కమర్షియల్ సినిమాలు తీసే విచిత్రాలు కూడా చేస్తున్నారు. వరల్డ్ మూవీస్ అంటే ఆర్ట్ సినిమాలని ఇప్పటికీ తెలుసుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అజ్ఞాత వాసి’ అనే ఫ్లాప్ ఇలాటిదే. నాని నిర్మించిన ‘ఆ’ అనే ఫ్లాప్ కూడా ఇలాటిదే. ఒక చిన్న బడ్జెట్ సినిమా ‘మనూ’ కూడా ఇంతే.

2018 లో పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, మహేష్ బాబు, అల్లుఅర్జున్, నాని, గోపీచంద్, రామ్ లు తలావొక సినిమా నటించారు. ఇవన్నీ ఫ్లాపయ్యాయి. పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాత వాసి’, నందమూరి బాలకృష్ణ ‘జై సింహా’, అక్కినేని నాగార్జున ‘ఆఫీసర్’, మహేష్ బాబు ‘భరత్అనే నేను’, అల్లుఅర్జున్ ‘నా పేరు సూర్య’, నాని ‘కృష్ణార్జున’, గోపీచంద్ ‘పంతం’, రామ్ ‘హలో గురూ ప్రేమ కోసమే’ …ఇవన్నీ ఫ్లాపయ్యాయి.

ఇక మూడు నటిస్తే మూడూ ఫ్లాపయిన స్టార్ రవితేజ. ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్’, ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ మూడూ అట్టర్ ఫ్లాపయ్యాయి. రెండు నటిస్తే రెండూ ఫ్లాపయిన స్టార్లు నల్గురున్నారు: నితిన్, నాగచైతన్య, సాయి ధరమ్ తేజ్, బెల్లం కొండ శ్రీని వాస్ లు. నితిన్ ‘చల్ మోహన రంగ’, ‘శ్రీనివాస కల్యాణం’ నటిస్తే రెండూ ఫ్లాప్ ; నాగచైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు’, ‘సవ్యసాచి’ నటిస్తే రెండూ ఫ్లాప్, సాయి ధరమ్ తేజ్ ‘ఇంటలిజెంట్’, ‘తేజ్ ఐలవ్యూ’ నటిస్తే రెండూ ఫ్లాప్ ; బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’, ‘కవచం’ నటిస్తే రెండూ ఫ్లాప్.

మూడు నటించి రెండు హిట్టయిన స్టార్ ఒకే ఒక్కడు : విజయ్ దేవరకొండ. ఇతను నటించిన ‘గీత గోవిందం’, ‘టాక్సీ వాలా’ హిట్టయి, ‘నోటా’ ఫ్లాపయ్యింది. రెండు నటించి రెండూ ఓ మోస్తరు విజయాలిచ్చిన స్టార్ ఒకే ఒక్కడున్నాడు : వరుణ్ తేజ్. ఇతను నటించిన ‘తొలిప్రేమ’, ‘అంతరిక్షం’ యావరేజీతో సరిపెట్టుకున్నాయి. రెండు నటించి ఒకటి హిట్టయిన స్టార్ కళ్యాణ్ రామ్. ఈయన నటించిన ‘ఎమ్మెల్యే’ హిట్టయి, ‘నా నువ్వే’ ఫ్లాపయ్యింది.

ఇద్దరు స్టార్లు ఒక్కటే నటించి ఆ ఒక్కటీ హిట్టిచ్చారు : ఎన్టీఆర్ ‘అరవింద సమేత’, రాంచరణ్ ‘రంగస్థలం’. ఇలా 18 మందిమంది స్టార్లు 27 సినిమాలు నటిస్తే, ఐదే హిట్టయి, 20 ఫ్లాపయ్యాయి, 2 రెండు యావరేజీ అన్పించుకున్నాయి.

చిన్నసినిమాలు ‘ఆరెక్స్ 100’, ‘హుషారు’ హిట్టవడం ఒక సర్ప్రైజ్. అలాగే ‘కంచరపాలెం’ అభిరుచిగల ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. స్టార్ సినిమాల భారీ పరాజయాల వెనుక కంటెంట్ పట్ల నిర్లక్ష్యమే వుంది. స్టార్ సినిమాలు ఇంకా అవే యాక్షన్, యాక్షన్ కామెడీలు, లేదా రోమాన్స్ లుగా రిపీట్ అవడం, ఇవి కూడా సీనియర్ స్టార్లయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు అప్పట్లో నటించిన సినిమా కథలకి రీసైక్లింగే కావడం, పైగా స్క్రీన్ ప్లేలు వదిలేసి టెంప్లెట్ లో ఆ కథల్ని కుక్కి, ఒకే నమూనాలో అచ్చులోంచి తీసినట్టు తీయడం, క్రియేటివిటీ పూర్తిగా కనుమరుగైపోవడం – ఈ ప్లాపులకి కారణాలు తప్ప మరోటి కాదు. కమర్షియల్ సినిమా అనుకుని ఆర్ట్ సినిమాలు తీయడం, కథలనుకుని గాథలు తీయడం, కమర్షియల్ సినిమాలనుకుని వరల్డ్ మూవీస్ ని కాపీకొట్టడం వుండనే వున్నాయి.

ఇది మారుతుందా అంటే ఎప్పటికీ మారదు. ఇరవై ఏళ్లుగా మారనిది ఇప్పుడేం మారుతుంది. కంటెంట్ ముఖ్యమనుకోవడం లేదు. కాంబినేషన్లే చాలనుకుంటున్నారు. నామ్ కే వాస్తే కంటెంట్. కాంబినేషనే మొత్తం బిజినెస్ చేసేస్తుంది. ఆ బిజినెస్ ని బాక్సాఫీసు ఆచితూచి సక్సెస్ చేస్తుంది – ఇలాగే ఓ నాల్గైదు మాత్రమేహిట్స్ ఇచ్చి. మిగిలిన వందల కోట్ల రూపాయలకి హామీ పడదు బాక్సాఫీసు కంటెంట్ చూసి. ఇదొక చక్రభ్రమణం. ప్రతీ ఏటా ఇదే తతంగం. మరణమృదంగం.

―సికిందర్