అల్లు అర్జున్ సైతం మెచ్చుకుని మాట సాయం

చిన్న సినిమాలు హిట్ అయితే దానికి మాట సాయిం చేసి, స్పాన్ పెంచుతున్నారు నేటి తరం హీరోలు. అంతా బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందనే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నారు. అలాంటివాళ్లలో బన్ని ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. తాజాగా ఆయన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాని మెచ్చుకున్నారు.

నవీన్‌ పొలిశెట్టిని హీరోగా పరిచయం చేస్తూ స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. చాలా కాలం తరువాత డిటెక్టివ్‌ తరహా కథతో రూపొందించిన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా నవీన్‌ నటన, స్వరూప్‌ టేకింగ్‌ను సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంపై స్టైలీష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ ప్రశంసలజల్లు కురిపించారు. రీసెంట్‌గా ఈ మూవీని చూసిన బన్నీ.. సోషల్‌ మీడియాలో వేదికగా తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

‘ ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రాన్ని చూశాను. ఇదొక మంచి హ్యూమర్‌తో కూడిన థ్రిల్లర్‌ మూవీ. కొత్త టాలెంట్‌ టాలీవుడ్‌కు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా తరుపును చిత్రబృందానికి కంగ్రాట్స్‌. థ్రిల్లర్‌ మూవీస్‌ను ఇష్టపడే వారు.. తప్పకుండా చూడాల్సిన చిత్రం’ అంటూ ట్వీట్‌ చేశారు.

గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా వారం రోజుల్లో పది కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ఈసందర్భంగా చిత్రయూనిట్ ఫిక్షనల్‌ కాదు ఒరిజినల్‌ బ్లాక్‌ బస్టర్‌ అంటూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మళ్లీరావా సినిమాతో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన రాహుల్‌యాదవ్‌ నక్కా ఈ సినిమాతో మరో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.