స్టార్ డైరెక్టర్లు కుమ్మక్కయ్యారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుని మరీ ఇలా ప్లాన్ చేశారేమిటో! ట్యాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తన చిత్రాలన్నింటినీ హరిక హాసిన్ క్రియేషన్స్ లోనే చేస్తుంటారు. స్నేహితుడు రాధాకృష్ణతో మాయావి డీల్ ఏమిటో ఊహించగలం. త్రివిక్రమ్ కి హారిక బ్యానర్ సొంత బ్యానర్ తో సమానం. అందుకే ఇదివరకూ ఇతర నిర్మాతల నుండి తీసుకున్న అడ్వాన్సులను కూడా తిరిగి వెనక్కి ఇచ్చేశాడని కథనాలొచ్చాయి. ఇకపై తన భవిష్యత్ సినిమాలన్నింటినీ హారికలోనే చేస్తాడట. ఇప్పుడు అదే బాటలో ఇతర స్టార్ డైరెక్టర్లు వెళుతున్నారు.
ముఖ్యంగా వరుస విజయాలతో అజేయుడిగా దూసుకెళుతున్న కొరటాల ఇదే బాటలో వెళుతున్నాడు. తన చిరకాల మిత్రుడు మిక్కిలినేని సుధాకర్‌ను అల్లు అర్జున్ చిత్రంతో నిర్మాతగా పరిచయం చేస్తున్నాడు. ఇదొక్కటే కాదు ఇకపై తన భవిష్యత్ చిత్రాలన్నీ సుధాకర్ నిర్మాణ సంస్థకే చేయాలని నిర్ణయించుకున్నాడట. సుధాకర్ ఏకైక నిర్మాత లేదా కొరటాల తెరకెక్కించే అన్ని చిత్రాలకు భాగస్వాములలో ఒకడిగా కొనసాగుతారట.
అయితే ఇదంతా దేనికోసం? అంటే .. సౌలభ్యం కోసమేనట. ఒకసారి పరిచయమై స్నేహితులు అయిపోయాక ప్రతిదీ చక్కగా కుదురుతుందనే. అంతేకానీ ఇందులో ఏ కుమ్మక్కు లేదని చెబుతున్నారు. త్రివిక్రమ్, కొరటాల బాటలోనే ఇతర స్టార్ డైరెక్టర్లు కూడా సొంత కాంపౌండ్లలో సినిమాలు చేసేందుకే ఆసక్తిగా ఉంటారన్న సంగతి విధితమే.