అలీనే అసలైన ఫ్రెండు.. సూపర్‌స్టార్లెవరూ కాదు!
దర్శకుడు పూరి జగన్నాథ్ తో అలీ స్నేహం గురించి తెలిసిందే. ఆ ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. పూరి ఏ సినిమా తీసినా అందులో అలీ ఉండాల్సిందే. అయితే అంత గొప్ప స్నేహం ఆ ఇద్దరి మధ్యా ఎలా మొదలైంది? అని ప్రశ్నిస్తే పూరి చెప్పిన కొన్ని సీక్రెట్స్ హృదయాన్ని టచ్ చేశాయి. అలీతో పూరి స్నేహం ఇప్పటిది కాదు. `సీతాకోక చిలుక` చిత్రంలో నటించినప్పటి నుంచి అలీకి పిచ్చి ఫ్యాన్. తూ.గో జిల్లా తుని అనే ఏరియాలో ఓ పార్టీ కోసం అలీ వస్తున్నారని తెలిసి తన కోసం 50 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చారట పూరి. ఆ రోజుల్లో సరైన రోడ్ ట్రాన్స్ పోర్ట్ కూడా ఉండేది కాదు.
ఆ తర్వాత పూరి దర్శకుడు అయ్యారు. ఆ క్రమంలోనే అలీ లేకుండా తన సినిమా లేనేలేదు. అలీ కోసమే ప్రత్యేకించి ఒక కామెడీ ట్రాక్ రాయడం పూరికి అలవాటు. అలా ఎన్నో బ్లాక్ బస్టర్ కామెడీ ట్రాక్ లను రాశారు. అవి వెండితెరపై నవ్వుల పువ్వులు పూయించాయి. కేవలం ఆ ఇద్దరి మధ్యా వృత్తిగతమైన స్నేహమే అనుకుంటే అందులో చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఆ ఇద్దరి మధ్యా స్నేహం అంతకుమించి. అప్పట్లో ఓ రియల్టర్ ఫ్రెండు పూరిని నిండా ముంచేసినప్పుడు ఉన్న ఇల్లు సహా ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. చివరికి ఆఫీస్ కూడా ఖాళీ చేసి చివరగా వెళుతున్నప్పుడు తన వద్దకు వచ్చిన అలీ ఓ దేవుడి బొమ్మ ఇచ్చారట. అప్పుడే పూజ చేసి ఆ బొమ్మను తెచ్చి పూరికి ఇచ్చారు. పోయినవన్నీ తిరిగి తెస్తుంది ఈ బొమ్మ అని భరోసానిచ్చారట. అతడు ఆ రోజు ఆ బొమ్మను తీసుకున్న తర్వాత తిరిగి మళ్లీ కోల్పోయినవన్నీ వచ్చేశాయి. ఆ తర్వాత పూరి సక్సెస్ బాట పట్టి వరుసగా సినిమాలు చేశారు. ఈ ఎమోషనల్ ఘట్టాలన్నిటినీ పూరి స్వయంగా `పండుగాడు ఫోటో స్టూడియో` ఆడియో వేదికపై వెల్లడించారు. అలీ ఈ చిత్రంతో పెద్ద సక్సెసవుతారని పూరి అన్నారు. “ఫెయిల్యూర్ వచ్చి నేనెప్పుడైనా బాధల్లో ఉంటే అలీనే వస్తాడు. ఒక పెగ్గు పోస్తాడు. తర్వాత భుజం తట్టి వెళ్లిపోతాడు. అదే నాకు హిట్ వస్తే.. ఒక బొకే పట్టుకుని వస్తాడు. హగ్ చేసుకుని వెళ్లిపోతాడు. నాకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా చెప్పకుండా వచ్చి కలిసే ఏకైక వ్యక్తి అలీనే“ అంటూ పూరి ఓ రకంగా ఎమోషన్ అయ్యారు. అన్నట్టు పూరి కష్టాల్లో ఉన్నప్పుడు ఫ్లాపుల్లో ఉన్నప్పుడు దూరమైపోయిన హీరోలెవరూ పూరీకి స్నేహితులు కాలేకపోయారని ప్రూవైంది. దీనిని బట్టి నిజమైన స్నేహితుడు ఎవరో పూరి ఆవేదనతనే బయటపెట్టేశారు.