రాజేంద్ర ప్రసాద్ ను దర్శకుడుగా మార్చిన అక్కినేని

“దసరా బుల్లోడు ”  డెబ్బయవ  దశకంలో ఆంధ్ర దేశాన్ని ఓ ఊపు  ఊపిన  ట్రెండ్ సెట్టర్ . అక్కినేని నాగేశ్వర రావు , వాణిశ్రీ, చంద్ర కల, ఎస్ . వి .రంగారావు , గుమ్మడి, సూర్య కాంతం తో వి బి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన సినిమా. . జగపతి ఆర్ట్ పిక్చర్స్  సంస్థ  నిర్మించిన సినిమా .

ఈ సినిమా వెనుక ఓ కథ వుంది . అప్పటివరకు వి బి రాజేంద్ర ప్రసాద్ తన జగపతి ఆర్ట్ పిక్చర్స్  పతాకంపై  అన్నపూర్ణ, ఆరాధన ,ఆత్మ బలం , అంతస్తులు ,అదృష్టవంతులు, అక్క చెల్లెల్లు  చిత్రాలను నిర్మించాడు .  ఆ తరువాత1970లో  గ్రామీణ నేపథ్యంతో ఓ కథ తయారు చేసుకున్నాడు రాజేంద్ర ప్రసాద్ . ఆ కథ  అక్కినేనికి వినిపిస్తే ఆయనకు కూడా ఎంతో నచ్చింది . డైరెక్టర్ గా వి. మధుసూదన రావు ను నియమించారు .

మొదట కథా నాయికగా  జయ లలితను అనుకున్నారు . ఆమె కాల్ షీట్లు  ఖాళీగా లేవు . తప్పని పరిస్థితుల్లో మరో హీరోయిన్ కావలసి వచ్చింది . అప్పుడు వాణిశ్రీ చాలా బిజీగా వుంది . అయినా ఆమెను ఒప్పించారు . మిగతా నటీనటులు అందరిని బుక్ చేశారు . యూత్ ను ఆకట్టుకొనే మాటలను ఆచార్య ఆత్రేయ రాచారు. సంగీత దర్శకుడుగా కె. వి. మహదేవన్ ను తీసుకున్నారు .

కృష్ణ జిల్లాలోని ఓ గ్రామంలో షూటింగ్ చెయ్యడాని లొకేషన్లు కూడా చూసి , కొన్ని సెట్స్  కూడా వెయ్యడం మొదలు పెట్టారు . అందరికీ కాస్ట్యూమ్స్  తదితరమైనవి అన్నీ సిద్ధం చేశారు .

కరెక్టు గా రాజేంద్ర ప్రసాద్ కు అప్పుడే ఓ పిడుగు లాంటి వార్త తెలిసింది . వేరే సినిమా షూటింగ్లో వున్న వి. మధుసూదన రావు కాల్ షీట్స్ అడ్జెస్ట్  చేయలేనని చెప్పేశాడు .

అప్పుడు మొదలయ్యింది రాజేంద్ర ప్రసాద్ లో టెన్షన్. ఏమి చెయ్యాలో , ఎలా చెయ్యాలో తెలియక మదన పడిపోయాడు . ఇప్పటికిప్పుడు మరో దర్శకుడు ఎవరు దొరుకుతారు ? వెంటనే నాగేశ్వర రావు గారి దగ్గరకు వెళ్లి విషయం చెప్పి ఆయన వైపు చూడ సాగాడు . ఆయన కూడా ఆలోచనలో పడ్డాడు .

అప్పుడు రాజేంద్ర ప్రసాద్ కు ఓ ఆలోచన మెరుపులా మెరిసింది. “దసరా బుల్లోడు ” మీరెందుకు డైరెక్ట్ చెయ్య కూడదు ? అని అక్కినేని వైపు చూశాడు . నాగేశ్వర రావు చిద్విలాసంగా నవ్వాడు .

“ఆ పనేదో నువ్వే చెయ్యి బాబు ” అన్నాడు.

రాజేంద్ర ప్రసాద్ ను  ఆయన  బాబు అని పిలుస్తాడు

” నేనా ? దర్శకత్వమా ?” అన్నాడు అయోమయంగా .

“అవును నువ్వే … నువ్వు చెయ్యక పొతే నేను ఈ సినిమా చెయ్యను .”  నిర్మొహమాటంగా చెప్పాడు

అలా రాజేంద్ర ప్రసాద్ అక్కినేని మాట కాదనలేక దర్శకత్వం చెయ్యడానికి ఒప్పుకున్నాడు .

1970 మధ్యలో సినిమా షూటింగ్ ప్రారంభమై 1971 జనవరి 13 న విడుదలై సంచలనం సృష్టించింది .

-భగీరథ