బ్రేకింగ్ : హీరో విశాల్ అరెస్ట్

తమిళ హీరో , తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ను పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. మద్రాస్ టి.న‌గ‌ర్‌లో ఉన్న నిర్మాతల మండలి కార్యాలయం త‌లుపులను బ‌ల‌వంతంగా తెరిచేందుకు విశాల్ ప్ర‌య‌త్నించడంతో పోలీసులకు, ఆయనకు మధ్య కొద్దిసేపు వివాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని, స్థానిక తైనంపేట పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించినట్లు సమాచారం.

పూర్తి వివరాల్లోకి వెళితే… గత కొంత కాలంగా విశాల్‌కు, నిర్మాతలకు మధ్య విబేధాలు మొదలయ్యాయి. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా విశాల్‌ను మొదట్లో అభినందిన వాళ్లే ఇప్పుడు విమర్శిస్తున్నారు. సమస్యలను పట్టించుకోవడం లేదని, పైరసీని అడ్డుకోవడంలో విఫలమయ్యాడని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీనికి తోడు ఈ నెల 21న తమిళనాట ఏకంగా 9 సినిమాలు రిలీజ్ అవుతుండటంతో.. అన్ని సినిమాలు ఒకసారి రిలీజ్ చేసేలా పర్మిషన్ ఎలా ఇచ్చారంటూ నిర్మాతలు విశాల్‌ను నిలదీశారు. ఈ నేపథ్యంలో విశాల్‌ను నడిగర్ సంఘంలోకి రానిచ్చేది లేదంటూ బుధవారం కొందరు కార్యాలయానికి తాళం వేశారు. దాంతో తాళం పగలగొట్టి లోనికి వెళ్లేందుకు విశాల్ ప్రయత్నించగా.. నడిగర్ సంఘం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చెన్నై పోలీసులు విశాల్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం విశాల్ ట్వీట్ చేసారు.

‘‘నిన్నటి వరకూ ఏమీ మాట్లాడని పోలీసులు ఈరోజు నన్నూ నా సహోద్యోగులను అరెస్టు చేశారు. కొందరు వ్యక్తులు మా కార్యాలయానికి తాళం వేశారు. మా తప్పేం లేకపోయినా మా మీద చర్యలు తీసుకున్నారు. ఇది ఎంతవరకు న్యాయం. మేం దీనిపై పోరాటం చేస్తాం. ఇళయరాజా సర్‌తో మాట్లాడి నిధులు సేకరించి నష్టపోయిన వాళ్లకు ఇచ్చేస్తాం’’ అని పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం విశాల్‌ ట్వీట్‌ చేశారు.