ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, క్రైస్తవమత ప్రబోధకుడు కేఏ పాల్ చిక్కుల్లో పడ్డారు. ఆయన పై హైదరాబాద్ పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. కేఏ పాల్ అమెరికా పంపిస్తానంటూ తన దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ సత్యవతి అనే మహిళ కేఏ పాల్ పై ఫిర్యాదు చేసింది.
పోలీస్ లు చెప్పిన కథనం ప్రకారం… తాను అమెరికా వెళ్లేందుకు సాయం చేయాల్సిందిగా రామచంద్రాపురానికి చెందిన సత్యవతి అనే మహిళ కేఏ పాల్‌ని ఆశ్రయించారు. అమెరికా వెళ్లేందుకు విజిట్ వీసా, స్పాన్సర్‌షిప్ లెటర్ అందిస్తానని కేఏ పాల్ పాల్ అనుచరులు రూ.5 లక్షలు డిమాండ్ చేశారు.
దానికి ఆమె ఒప్పుకుని ఇప్పటికే రూ.2లక్షల చెక్కును ఇస్తే….ఆ డబ్బును బ్యాంకు నుంచి కూడా డ్రా చేశారు.
రూ.రెండు లక్షల రూపాయలు చెక్ ను క్యాష్ చేసుకున్నంత వరకు కేఏ పాల్ సత్యవతితో మాట్లాడి డ్రా చేసుకున్న అనంతరం ఆమె నంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. చివరికి కేఏ పాల్ ను పట్టుకున్న ఆమె తనను అమెరికా ఎందుకు పంపించడం లేదని నిలదీసింది.
డబ్బులు తీసుకున్న తర్వాత స్పాన్సర్‌షిప్ లెటర్‌ని ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని సత్యవతి ఆరోపించారు. ఈ విషయమై పాల్ అనుచరులను అనేక సార్లు ప్రశ్నించినా..అటు వైపు నుంచి రెస్పాన్స్ సరిగా లేకపోవడంతో పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు సత్యవతి. ఆమె ఫిర్యాదు మేరకు కేఏ పాల్‌తో పాటు విజయ్, జ్యోతిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.