సస్పెన్స్.. హారర్ థ్రిల్లర్ కథాంశాల్ని గ్రిప్పింగ్ గా తెరకెక్కించి సక్సెస్ అందుకుంటున్నారు నవతరం దర్శకులు. ఆ కోవలో ఇటీవల పలు చిత్రాల రిజల్ట్ ఆశ్చర్యపరిచింది. భారీతనం లేకపోయినా కంటెంట్ పరంగా ఆకట్టుకుంటే కుర్చీ అంచున కూచోబెట్టగలిగితే కొత్త నటీనటులు అయినా జనం ఆదరిస్తున్నారు.
ఇదే కోవలో రాబోతోంది A. యాడ్ ఇన్ఫినిటమ్ (AD INFINITUM) అనే శీర్షికను నిర్ణయించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ స్వయంగా ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేయడం ఆసక్తిని పెంచింది. టీజర్ ఆద్యంతం థ్రిల్ కలిగించే మిస్టీరియస్ ఎలిమెంట్ ఆకట్టుకుంది. టీజర్ కి విజువల్స్.. రీరికార్డింగ్ ప్రధాన అస్సెట్ గా నిలిచాయి. ఉత్కంఠ పెంచే మ్యాటర్ తోనే సినిమాని తెరకెక్కించారన్న ఆసక్తి కలిగింది. అయితే టీజర్ లో చూపించిన గ్రిప్ సినిమా ఆద్యంతం ఉంటేనే ఇలాంటివి వర్కవుటవుతాయి. ల్యాగ్ లేకుండా తెరకెక్కించడం చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో దర్శకుడు యుగంధర్ ముని ఏమేరకు సక్సెసయ్యారు? అన్నది చూడాలి. అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సల ఈ చిత్రాన్ని నిర్మించారు.
సీనియర్ నటుడు జగపతి బాబు చేతుల మీదుగా విడుదలైన A మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది. తాజా టీజర్ కేవలం 55 సెకనుల నిడివితో… సౌండ్ ఎఫెక్ట్స్ ఆకర్షణతో మెప్పిస్తోంది. టీజర్ ని బట్టి కథ అంతా చిన్నారి చుట్టూ తిరుగుతూ సస్పెన్స్ సన్నివేశాలతో రక్తి కట్టిస్తోందని అర్థమవుతోంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకి ఏకలవ్య శిష్యుడిగా యుగంధర్ మార్క్ కనిపిస్తోంది. మళ్ళీరావా, ప్రెషర్ కుక్కర్” ఫేమ్ ప్రీతి అశ్రాని హీరోయిన్‌గా అస్సెట్ కానుంది. ఈ చిత్రం లోని అన్ని పాటలను అనంత శ్రీరామ్ రాయగా దీపు, పావని ఆలపించారు. విజయ్ కూరాకుల సంగీతం అందించారు. చిత్రంలో హీరో నితిన్ ప్రసన్న 3 విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు.ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ని థియేటర్స్ రీ ఓపెన్ కాగానే విడుదల చేయనున్నారు.