ఆస్కార్ గ్రహీత పారితోషికం అంత బాదేస్తున్నాడా?
బాహుబలి ఫ్రాంఛైజీతో దేశంలోని అసాధారణ ఫాలోయింగ్ ఉన్న స్టార్ల జాబితాలో చేరాడు ప్రభాస్. పద్మావత్ 3డి చిత్రంతో గొప్ప నాయికగా వెలిగిపోయింది దీపిక పదుకొనే. ఈ జోడీ కలిస్తే.. తెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది? అన్నది అభిమానుల కోరిక. దానిని నిజం చేస్తూ.. ప్రభాస్ -దీపికా పదుకొనే జంటగా నాగ్ అశ్విన్- అశ్వినీ దత్ బృందం తెరకెక్కిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ రూపొందుతోంది. ప్రస్తుతం ఫ్యాన్స్ లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ కెళ్లనుంది. 2022 లో ఎప్పుడైనా థియేటర్లలోకి వచ్చే వీలుందని సమాచారం.
ఈ సినిమాకి స్వరకర్త ఎవరు? అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ సంగీత దర్శకుల పేర్లను పరిశీలించి చివరికి ఆస్కార్ విజేత సుస్వర మాంత్రికుడు ఏ.ఆర్. రెహమాన్ తో డీల్ మాట్లాడుతున్నారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో ఏకకాలంలో నిర్మించబోయే ఈ చిత్రానికి రెహమాన్ ఏకంగా 4 కోట్ల పారితోషికం డిమాండ్ చేశారట.
ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ కారణంగా, రెహమాన్ ఎంత అడిగినా చెల్లించేందుకు అశ్వనిదత్ వెనకాడడం లేదట. భారీ చెక్ ఇవ్వడం అస్సలు మేకర్స్ కి పెద్ద సమస్య కానే కాదు. అయితే రెహమాన్ తో పని చేయించడం అంటే అంత ఈజీ కాదు. నాగ్ అశ్విన్ కి అతి పెద్ద సవాల్ ఇది. ఆయన అడిగినంత సమయం ఇస్తేనే పనవుతుంది. మరి ఏం జరగనుంది? అన్నది వేచి చూడాలి.