న‌డిరోడ్డున 50 వేల థియేట‌ర్ కూలీ కుటుంబాలు

తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ స‌న్నివేశం తెలిసిందే. లాక్ డౌన్ వ‌ల్ల వేలాది కార్మికులు నానా ఇక్క‌ట్లు ప‌డుతున్నారు. కొంద‌రు తిండికి లేక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఉద్యోగాల్లేవ్.. ఉపాధి క‌రువైంది. నిత్యావ‌స‌రాలైనా లేక ప్ర‌భుత్వాలు ఆదుకోక తీవ్ర క‌ల‌త‌కు గుర‌వుతున్నారు. మ‌రోవైపు కరోనా మహమ్మారి తీవ్రత ఇంకా భారత్‌ లో రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే ప‌రిస్థితి.

ఇక దీని ప్ర‌భావం సినీరంగంపై అంతా ఇంతా కాదు. ఈ రంగంలో ఉపాధి పొందుతున్న ల‌క్ష మంది కార్మికుల‌పై ప్ర‌త్య‌క్షంగా ప్ర‌భావం చూపుతోంద‌ని అంచ‌నా. ఇందులో ఏపీ-తెలంగాణ‌లో కేవ‌లం థియేట‌ర్ వ‌ర్క‌ర్స్ ఏకంగా 50 వేల మంది ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు. కేవ‌లం తెలంగాణ‌లోనే 25 వేల మంది థియేట‌ర్ వ‌ర్క‌ర్స్ ఉన్నార‌ని తాజాగా రివీలైంది. కరోనా ఎఫెక్ట్ తో తెలంగాణ‌- ఏపీలో థియేటర్స్‌ అన్ని మూసేశారు. ఆ క్ర‌మంలోనే తెలంగాణ రాష్ట్రంలో సినిమా థియేటర్స్‌లో పనిచేసే కార్మికులు ఉపాధి కోసం రోడ్డెక్కారు. అంతేకాదు.. త‌మ ఉద్యోగాలు పోతున్నాయ‌ని.. స‌గం జీత‌మే ఇస్తున్నార‌ని ఆరోపిస్తూ.. పూర్తి వేతనాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సినిమా థియేటర్స్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన దీక్ష చేశారు. సీఐటీయు ఆధ్వ‌ర్యంలో జీవో 45ని అమ‌ల్లోకి తెచ్చి కార్మికులను ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు.

ఇప్ప‌టికే థియేట‌ర్ యాజ‌మాన్యాలు మార్చి, ఏప్రిల్ నెల జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. అడిగితే ఉద్యోగాలు తీసేస్తున్నార‌ని వాపోతూ హైద‌రాబాద్ లో ధ‌ర్నా చేశారు. తమను ఇబ్బందులకు గురి చేస్తున్న యజమానుల పై కఠిన చర్యలు తీసుకొని సకాలంలో జీతాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇటు తెలంగాణ‌లో ఉన్న ప‌రిస్థితే అటు ఏపీలోనూ ఉంది. అక్క‌డా థియేట‌ర్ల‌లో ప‌ని చేసే వ‌ర్క‌ర్స్ ఉపాధిని కోల్పోయి ఇండ్ల‌లోనే ఉంటున్న సంగ‌తి తెలిసిందే. వారిని ఆదుకునేందుకు ఎవ‌రు వ‌స్తారు? అన్న‌ది డైల‌మా.

మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన సీసీసీ (క‌రోనా క్రైసిస్ చారిటీ) ద్వారా థియేట‌ర్ కార్మికుల్ని ఆదుకోవాల‌న్న డిమాండ్ వినిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే హైద‌రాబాద్ లో ఇబ్బందుల్లో ఉన్న మెజారిటీ సినీకార్మికుల‌కు సీసీసీ సాయం చేస్తోంది. సినీజ‌ర్న‌లిస్టులకు సీసీసీ నిత్యావ‌స‌రాల సాయం చేసిన సంగ‌తి తెలిసిందే.