కరోనా లాక్ డౌన్ రకరకాల పాఠాల్ని నేర్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ సెట్స్ పై ఉన్న భారీ చిత్రాల షెడ్యూల్స్ మారాయి. రిలీజ్ తేదీల మార్పులపై ప్రకటనలు రానున్నాయి. ఇక కాస్ట్ కంట్రోల్ మంత్రం జపిస్తూ ఒకటే వేడెక్కించేస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పాన్ ఇండియా సినిమాలన్నిటినీ అసలు కరోనా కల్లోలంతో పని లేకుండా రిలాక్స్ డ్ గా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇప్పటికిప్పుడు ఆర్ఆర్ఆర్ సహా జాన్, మహేష్ 27(పరశురామ్), పీఎస్.పీకే 27 , కేజీఎఫ్ 2 లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాల్ని రిలీజ్ చేసే సన్నివేశం కనిపించడం లేదు. షూటింగులు బంద్ అవ్వడంతో వీళ్లంతా ఇబ్బందికర పరిస్థితిలోనే ఉన్నారు. ఈ సినిమాల దర్శకనిర్మాతలు రిలీజ్ తేదీలపై ప్రస్తుతం తర్జనభర్జన పడుతున్నారు. అంతా సవ్యంగా సాగితే కేజీఎఫ్ 2ని ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అది కూడా వాయిదా పడుతోంది. 2021 సంక్రాంతి అయితే కలిసొస్తుందన్న ఆలోచన హోంబలే అధినేత కు ఉందిట. అయితే వాళ్లు ఈ ఆలోచన చేయడానికి కారణం సంక్రాంతి బరి నుంచి వేసవికి ఆర్.ఆర్.ఆర్ షిఫ్టవుతుండడమే.
ఈలోగానే కేజీఎఫ్ 2కి బోలెడంత కాంపిటీషన్ కనిపిస్తోంది. మహేష్ కథానాయకుడిగా పరశురామ్ తెరకెక్కించే సినిమాని 2021 సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన ఉందట. దాంతో పాటే పవన్ కల్యాణ్ – క్రిష్ కాంబినేషన్ పాన్ ఇండియా మూవీని అప్పటికి సిద్ధం చేస్తే ధీమాగా ఉంటుందని భావిస్తున్నారట. ప్రభాస్ జాన్ మోస్ట్ లీ ఈ ఏడాదిలోనే రావాల్సి ఉన్నా.. కరోనా రకరకాల సందిగ్ధతలకు కారణమవుతోంది. సంక్రాంతికే వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన యూవీ మైండ్ లో ఉందట. ఇక వీళ్లతో పాటే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప విషయంలోనూ ఇదే ఆలోచన సాగుతోందన్న లీక్ అందింది. సంక్రాంతి బరిలో ఆర్.ఆర్.ఆర్ లేకపోతే ఆ తేదీ తమకు కలిసొస్తుందని బన్నీ భావించి సుకుమార్ చెవిలో వేశారట. అయితే ఆర్.ఆర్.ఆర్ లేకపోతేనేం… సంక్రాంతి బరిలో పవన్ – ప్రభాస్ – మహేష్- బన్ని- యష్ లాంటి స్టార్లు బరిలో దిగితే ఆ పోరు ఎంతో రసవత్తరంగానే ఉంటుందనడంలో ఏ సందేహం లేదు. అయితే ఏదీ అనుకున్నంత ఈజీ కాదు. రకరకాల సమీకరణాలు ఆలోచించాకే రిలీజ్ తేదీని ఫైనల్ చేసే వీలుంటుంది. కాస్త ఆగితే మరింత క్లారిటీ వస్తుందేమో!