2020 క్రిస్మస్ నాటికి కానీ ఈ ఏడాది రిపోర్ట్ ఏమిటి? ఏది ఉత్తమ చిత్రం.. ఎవరు ది బెస్ట్? అనేది నిర్ణయించలేం. కానీ ఈసారి సమ్మర్ లేదు.. వినాయక చవితి లేదు.. దసరా లేదు.. క్రిస్మస్ లేదు. పండగల్లో ఈసారి సందడే లేదు. కోవిడ్ మహమ్మారీ దెబ్బకు సినిమాల రిలీజ్ లకు ఆస్కారం లేకుండా పోయింది.
కరోనావైరస్ మహమ్మారి ప్రతిదీ మార్చేసింది. బాలీవుడ్‌లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌ను ఇప్పటికే నెటిజనులు అత్యుత్తమ చిత్రమిదే అంటూ ప్రకటించారు. అజయ్ దేవ్‌గన్ నటించిన `తానాజీ` ది బెస్ట్ హిట్ చిత్రం అంటూ ప్రకటించారు.
ఈ సంవత్సరం మార్చి నుండి సినిమా థియేటర్లు మూసివేయడంతో అటుపై రిలీజ్ లు ఏవీ లేవు. మరికొన్ని నెలలు థియేటర్లు తిరిగి తెరిచే సంకేతాలు లేవు. ఫిల్మ్ షూటింగులేవీ లేకపోవడం వల్ల ఈ సంవత్సరం పెద్ద సినిమాలు తెరపైకి రాలేదు.
అమీర్ ఖాన్ చిత్రం `లాల్ సింగ్ చద్దా` వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అక్షయ్ కుమార్ నటించిన పలు భారీ చిత్రాలు వాయిదా పడ్డాయి. సల్మాన్ ఖాన్ నటించిన `రాధే` విడుదల వాయిదా పడింది. ఒకవేళ ఇప్పట్లో థియేటర్లు తిరిగి తెరిచినా ప్రేక్షకులు వస్తారా రారా అన్నది చెప్పలేం.
ఈ పరిణామాల వల్లనే తానాజీనే 2020 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ప్రకటించేశారు. 2020 అజయ్ దేవ్‌గన్ ఇయర్ అని డిక్లేర్ చేశారు. ఇటు తెలుగులో అల వైకుంఠపురములో ది బెస్ట్ హిట్ చిత్రంగా నిలవగా అల్లు అర్జున్ బెస్ట్ హీరో అని భావించాల్సి ఉంటుంది.