2019లో బుల్లితెర పై విజ‌యం సాధించిన చిత్రాలివే…?

తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచుల్లో మార్పులు వ‌చ్చాయి. సినిమా చూసే విధానం మారింది. క‌థకు ఎక్కువ‌గా ప్రాధాన్య‌త నిస్తున్నారు. క‌థ బావుంటేనే ప్రేక్షకులు థియేట‌ర్ల వ‌ర‌కు వ‌స్తున్నారు. ఏమాత్రం ఫ్లాప్ టాక్ వ‌చ్చినా కూడా సినిమా వైపు కూడా చూడ‌డం లేదు. ఎంతో వీరాభిమానులైతే మాత్రం థియేట‌ర్ల‌కు వెళ్ళ‌డం లేదు. మ‌రీ చూడాల‌నుకుంటే మాత్రం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్,హాట్ స్టార్,సన్ నెక్ట్స్ వంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో వస్తే చూద్దాంలే అని లైట్ తీసుకుంటున్నారు.ఒకవేళ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో చూడలేని వాళ్లు పండగ రోజుల్లో లేకపోతే హాలీడేస్ రోజున ప్రసారమైతే చూస్తున్నారు. ఇలా నిర్మాతలకు థియేట్రికల్ రూపంలో కంటే డిజిటల్,శాటిలైట్ రూపంలో బాగానే వెనకేసుకుంటున్నారు. అలా ఈ యేడాది డిజిటల్ కాకుండా శాటిలైట్ రూపంలో టీవీల్లో ప్రసారమయిన సినిమాల్లో ఎక్కువ టీఆర్‌పీ సాధించిన సినిమాలు ఏవేవి ఉన్నాయో ఓ సారి చూసేద్దాం…

1. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ‘ఎఫ్ 2’ చిత్రం బాక్సాఫీస్ క‌లెక్ష‌న్లు బ‌ద్ద‌లు కొట్ట‌డ‌మే కాకుండా టీవీలోనూ మంచి విజయాన్నేసాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం స్మాల్ స్క్రీన్ పై 17.2 టీఆర్పీ సాధించి ఈ ఇయర్ టాప్ టీఆర్పీ సాధించిన చిత్రంగా నిలిచింది.

2. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్‌. హీరో రామ్, నిధిఅగ‌ర్వాల్‌, న‌భాన‌టేష్ క‌లిసి న‌టించిన చిత్ర‌మిది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. అంతేకాక బుల్లితెర‌పైన కూడాస్మా16.63 టీఆర్పీతో 2019లో రెండో స్థానాన్ని దక్కించుకుంది.

3. ముని సిరీస్‌లో వచ్చిన మరో సినిమా ‘కాంచన 3’. లారెన్స్ స్వీయ దర్శకత్వంలో నటించి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి లాభాలనే తీసుకొచ్చింది. తెలుగులో కూడా పర్లేదనిపించింది కాంచన. ఈ చిత్రం టీవీలో ప్రసారమయినపుడు 13.10 టీఆర్పీ నమోదు చేసింది.

4.రాక్షసుడు సినిమాతో వరస ఫ్లాపులకు ఫుల్ స్టాప్ పెట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇండస్ట్రీకి వచ్చిన ఐదేళ్ల తర్వాత కనీసం ఓ యావరేజ్ అందుకున్నాడు ఈయన. 12 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన రాక్షసుడు సినిమా చివరికి 12 కోట్ల దగ్గరే ఆగింది. అద్భుతమైన టాక్ వచ్చినా కూడా కలెక్షన్ల రూపంలో మాత్రం అది కనిపించలేదు. కానీ స్మాల్ స్క్రీన్‌లో ఈ చిత్రం 10.1 టీర్పీతో నాల్గో ప్లేస్‌లో నిలిచింది.

5.సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గరే కాదు.. టీవీల్లో 9.2 రేటింగ్‌తో ఐదో ప్లేస్‌లో నిలిచింది.

6. సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ బేబీ’ మూవీ ..టెలివిజన్ తెరపై 9 టీఆర్పీ సాధించింది.

7.గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన జెర్సీ సినిమా థియేటర్స్‌లనే కాదు…స్మాల్ స్క్రీన్‌‌లో సత్తా చాటింది. ఈ చిత్రం 8.8 టీఆర్పీతో 7వ స్థానంలో నిలిచింది.

8.నాగచైతన్య కూడా చాలా ఏళ్ళ తర్వాత బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. రారండోయ్ వేడుక చూద్దాం తర్వాత చేసిన యుద్ధం శరణం, శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ ఏడాది మజిలీ సినిమాతో హిట్ కొట్టాడు చైతూ. ఈచిత్రం స్మాల్ స్క్రీన్ పై 7.9 టీఆర్పీతో 8వ ప్లేస్‌లో నిలిచింది.

9.బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’లో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. అంతేకాదు టీవీ తెరపై కూడా ఈ చిత్రం అంతగా నడవలేదు. ఈ చిత్రం టీవీల్లో 7.9 టీఆర్పీ నమోదు చేసిన టాప్ 9లో నిలిచింది.

10. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 118 స్మాల్ స్క్రీన్ పై 6.33 రేటింగ్‌తో 11వ ప్లేస్‌లో నిలిచింది.

11. చిరంజీవి హీరోగా నటించిన ‘సైరానరసింహారెడ్డి’ సినిమాలో తెలుగులో ప్రసారం కాకపోయినా.. తమిళ వెర్షన్ ప్రీమియర్ టెలికాస్ట్ చేయగా.. అక్కడ 15.3 టీఆర్పీ నమోదు చేసింది. ఇక ఇవ‌న్ని చిత్రాలు కూడా బుల్లి తెర పై మంచి విజ‌యాలు సాధించిన చిత్రాలే.