2018: ‘డ‌బ్బింగు సినిమా’ అంటే ‘దొబ్బింది సినిమా’

2018 వెళ్లిపోతూ తెలుగు డబ్బింగ్ లకు కొత్త నిర్వచనం ఇచ్చింది. డబ్బింగ్ అంటే కేవలం డబ్బులు పోగొట్టుకునే ఓ పక్రియ అని క్లారిటీ ఇచ్చేసింది. గమనించే చూస్తే 2018లో నిలబెట్టి ఆడిన ఒక్క డబ్బింగ్ సినిమా మనకు కనిపించదు. ఒకప్పుడు వరసగా కమల్, రజనీ సినిమాల డబ్బింగ్ లు భాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపి కొంతమంది డబ్బింగ్ నిర్మాతలను తయారు చేసాయి. హీరోలు లేకపోయినా ప్రేమిస్తే, బిచ్చగాడు లాంటి సినిమాలు సైతం ఆడి ఆ నిర్మాతలకు ధైర్యాన్ని ఇచ్చాయి.

తెలుగు వాళ్లు సైతం వైవిధ్యం ఉంటే అది ఏ భాషా చిత్రమైనా ఓకే అన్నట్లుగా చూస్తూ, ఆదిరిస్తూ, డబ్బులిస్తున్నారు. ఆ విషయంలో తమిళ సినిమాలు ముందుండేవి, వైవిధ్యానికి మారు పేరుగా నిలిచాయి. కానీ సీన్ మారింది. ఇప్పుడు తెలుగు సినిమాలు ప్రపంచంలో అన్ని చోట్లా ఆడుతున్నాయి. మన సినిమాలనే రీమేక్ లు, డబ్బింగ్ లు చేసుకుంటున్నారు. కానీ వేరే చోట నుంచి వచ్చినవేమీ వర్కవుట్ కావటం లేదు.

2018 ప్రారంభమే సంక్రాంతికి సూర్య నటించిన గ్యాంగ్ సినిమాతో డబ్బింగ్ పండగ మొదలైంది. తమిళంలో బాగానే ఆడిన ఈ సినిమా తెలుగుకు వచ్చేసరికి పెద్దగా ఆదరణకు నోచు కోలేదు. ఆ తర్వాత విక్రమ్ నటించిన స్కెచ్, సామీ 2 కూడ అదే పరిస్దితి. ఇక కార్తీ నటించిన చినబాబు ని పట్టించుకున్న వాళ్లే లేరు.

పోనీ వీళ్లను వదిలేసి తమిళ స్టార్ హీరోలు క‌మ‌ల్‌, ర‌జ‌నీలు తమ సినిమాలను డబ్ చేసి వదిలితే వాటికి అదే పరిస్దితి. క‌మ‌ల్ ‘విశ్వ‌రూపం 2’ని జనం తట్టుకోలేకపోయారు. ర‌జ‌నీ న‌టించి కాల అయితే దారుణం. ‘రోబో 2.ఓ’కి ఓపెనింగ్స్ బాగున్నా..ఎక్కువ రేటు పెట్టి కొన్నవాళ్ల కు నష్టాలు తప్పలేదు.

ఇక ఇప్పటికీ ‘బిచ్చ‌గాడు’పేరు చెప్పి వరస సినిమాలు వదలుతున్న విజ‌య్ ఆంటోనీకి మళ్లీ ఒక్క హిట్టు కూడా రాలేదు. ‘కాశి’, ‘రోష‌గాడు’వర్కవుట్ కాలేదు. ఉన్నంతలో విజ‌య్ ‘స‌ర్కార్‌’, విశాల్ ‘అభిమ‌న్యుడు’, ‘పందెంకోడి 2’కాస్త రిలీఫ్ ఇచ్చాయి. మ‌ణిర‌త్నం ‘న‌వాబ్‌’బాగుందన్నవాళ్లే కానీ చూసిన వాళ్లే లేరు. న‌య‌న‌తార సినిమాలకు ఓపినింగ్స్ కూడా రావటం చాలా చాలా కష్టమవుతోంది. అలా వరసపెట్టి డబ్బింగ్ సినిమాలు డబ్బులు పోగొట్టే సినిమాలుగా మారిపోయాయి.