రాజమౌళి పేరు చెప్పి మోసం,జాగ్రత్త
సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయిన తర్వాత మోసాలు కూడా అదే స్దాయిలో పెరిగాయి. పెద్ద పెద్ద సెలబ్రెటీల పేర్లు వాడుతూ మోసాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగింది. వీరిని కనిపెట్టుకుని ఉంటూ ఎప్పటికప్పుడూ జనాలను హెచ్చరించాల్సిన పరిస్దితి కూడా సెలబ్రెటీలకు ఏర్పడింది. తాజాగా రాజమౌళి పేరుతో చేస్తున్న మోసం ఒకటి బయిటపడింది. ఈ విషయమై ఆర్ ఆర్ ఆర్ నిర్మాతలు ఓ ప్రకటన విడుదల చేసారు.
వివరాల్లోకి వెళితే..ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తీస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా కోసం నటులు కావాలంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ట్వీట్లు చేసింది. నిజంగా నూతన నటులు కావాలంటే తన టీమ్ నేరుగా అఫీషియల్ ఎక్కౌంట్ ద్వారా సంప్రదిస్తుందని పేర్కొంది.
‘కొంతమంది అపరిచితులు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పేరుతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్మీడియా ఖాతాలు నడుపుతూ.. ప్రజల్ని మోసం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకు క్యాస్టింగ్ కాల్స్ అంటూ ఫేక్ పోస్ట్లు చేస్తున్నారు. ఇలాంటి మోసపూరిత క్యాస్టింగ్ కాల్స్ గురించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని మేం హెచ్చరిస్తున్నాం. మా ప్రాజెక్టుకు సంబంధించిన ఎటువంటి సమాచారాన్నైనా నేరుగా మా ‘ఆర్.ఆర్.ఆర్’ అధికారిక మాధ్యమం ద్వారానే ప్రకటిస్తాం’ అని పోస్ట్లు చేశారు.
ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. చెర్రీ.. అల్లూరి సీతారామరాజు పాత్రలో, తారక్.. కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నటి ఆలియా భట్ చెర్రీ భార్య పాత్ర పోషిస్తున్నారు. హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిసింది. 2020 జులై 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.