హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న శివాజీరాజా కొడుకు

‘మా’ అధ్యక్షుడు, సీనియర్ నటుడు శివాజీరాజా కుమారుడు విజయ్ రాజా హీరోగా పరిచయమవనున్నాడు. కే.రమాకాంత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఏదైనా జరగొచ్చు’ అనే మూవీ ద్వారా వెండితెర ఎంట్రీ ఇవ్వనున్నాడు. దర్శకుడుకి ఇది మొదటి సినిమా. వెట్ బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకుడు కే.రాఘవేంద్రరావు క్లాప్ కొట్టారు. రవిరాజా పినిశెట్టి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. పరుచూరి బ్రదర్స్, ఎస్వీ కృష్ణారెడ్డి, కే.అచ్చిరెడ్డి, హీరోలు శ్రీకాంత్, తరుణ్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం తర్వాత శివాజీరాజా మీడియాతో మాట్లాడారు. గత 32 సంవత్సరాలుగా మీరంతా నాపైన ప్రేమ చూపించారు, నాకు సపోర్టుగా ఉన్నారు. మా అబ్బాయికి కూడా అదే ప్రేమని, సప్పోర్టును ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా స్టోరీలు విన్నాం కానీ ఎందుకో రమాకాంత్ చెప్పిన ఈ కథే నాకూ, మా అబ్బాయికి నచ్చింది. నటించటానికి కావాల్సిన అంశాలలో శిక్షణ తీసుకున్నాడు. తను సలహా కోసం నా దగ్గరకు వచ్చినప్పుడు ఇండస్ట్రీలో నిలబడాలి అంటే చిరంజీవిగారిలా కష్టపడాలి, కృష్ణగారిలా మంచి మనసు ఉండాలి అని చెప్పాను. అవి పాటిస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని దర్శకుడికి పేరు, నిర్మాతలకు డబ్బులు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అని వెల్లడించారు శివాజీరాజా.

దర్శకుడు రమాకాంత్ మాట్లాడుతూ చంద్రశేఖర్ యేలేటి వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన అనుభవంతో ‘ఏదైనా జరగొచ్చు’ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాను. ఇది హారర్ జోనర్ లో సాగే కామెడీ థ్రిల్లర్. దర్శక, నిర్మాతలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని చెప్పారు. నేను హీరో అవడానికి అమ్మానాన్నల ప్రోత్సాహంతో పాటు మావయ్య సపోర్టు కూడా ఉందని హీరో విజయ్ తెలిపాడు. నాన్న గర్వపడేలా చేస్తాను. నామీద నమ్మకంతో అవకాశం కల్పించిన ‘వెట్ బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు’ ధన్యవాదాలు అని చెప్పాడు విజయ్ రాజా. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ ప్రకాష్. కాగా శ్రీకాంత్ పెండ్యాల ఈ మూవీకి బాణీలు సమకూర్చనున్నారు.