హిట్టొచ్చింది.. రేంజ్ రోవ‌ర్‌ని తెచ్చింది!

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సినిమా వాళ్ల‌కి ఆనందం వ‌చ్చినా, కోపం వ‌చ్చినా ఆప‌డం క‌ష్ట‌మే సుమీ.. కోపం వ‌స్తే గొడ‌వ‌లు… ఆనందం వ‌స్తే బ‌హుమ‌తులు ఇచ్చిపుచ్చ‌కోవ‌డం కామ‌నే. ఇటీవ‌ల వ‌రుస ష్లాపుల్లో వున్న మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌కు `ప్ర‌తిరోజు పండ‌గే` మంచి హిట్‌ని అందించిన విష‌యం తెలిసిందే. గ‌త నెల‌లో రిలీజ్ అయిన ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా కూడా శభాష్ అనిపించుకుంది. 17 రోజుల్లో ఈ చిత్రం 32 కోట్లు కొల్ల‌గొట్ట‌డం ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురిచేస్తోంది.

ఫస్ట్ వీక్ త‌రువాత థియేట‌ర్ల‌లో క‌నిపించ‌డం క‌ష్ట‌మే అన్న వాళ్లంతా ఇప్పుడు నోరెళ్ల‌బెడుతున్నారు. థ‌ర‌క‌డ్ వీక్‌లోనూ అదే స్థాయి క‌లెక్ష‌న్‌ల‌ని మెయింటైన్ చేస్తూ స‌క్సెస్‌ఫుల్ టాక్‌తో ర‌న్న‌వుతోంది. ఊహించ‌ని విధంగా రెండ‌వ వారం నుంచే లాభాల బాట‌ప‌ట్ట‌డంతో ఈ చిత్ర నిర్మాత‌ల ఆనందానికి హ‌ద్దేలేద‌ట‌. దీంతో ద‌ర్శ‌కుడు మారుతికి కాస్ట్‌లీ గిప్ట్ ఇచ్చేశారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2తో పాటు యువీ క్రియేష‌న్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

ఊహించిన దానికి మించి ఈ చిత్రం లాభాలు తెచ్చిపెడుతుండ‌టంతో యువీ క్రియేష‌న్స్‌కి చెందిన వంశీ రేంజ్ రోవ‌ర్ కారుని బుధ‌వారం ద‌ర్శ‌కుడు మారుతికి బ‌హుమ‌తిగా అందించారు. ఆ ఫొటోని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల కోసం షేర్ చేసిన మారుతి `థ్యాంక్యూ వంశీ డార్లింగ్ నీలాంటి ఫ్రెండ్ వుంటే ప్ర‌తిరోజు పండగే` అని ట్వీట్ చేసి కారుతో వున్న ఫొటోని షేర్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది.