Maruthi: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న చాలా మంది ఒకప్పుడు ఎన్నో కష్టాలను ఎదురుకున్నవారే. అలా చాలా కష్టాలు, సమస్యలు, అవమానాలు వీటన్నిటిని దాటుకొని నేడు మంచి పొజిషన్ లో ఉన్నారు. అలా ఒకప్పుడు సమస్యలను ఎదుర్కొన్న వారిలో డైరెక్టర్ మారుతి కూడా ఒకరు. దర్శకుడు మారుతి కూడా ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో కష్టాలను ఎదుర్కోవడంతోపాటు ఎన్నో పనులు కూడా చేశారట. టాలీవుడ్ ఇండస్ట్ లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా సహనిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారట. అలా తనకు కట్నంగా వచ్చిన డబ్బుతో ఆర్య సినిమా కొని డిస్ట్రిబ్యూటర్ గా హిట్ అందుకున్నాడు.
ఆ తర్వాత దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో హిట్లు, ఫ్లాపులు అన్నీ చూశాడు. 2022లో చివరగా తీసిన పక్కా కమర్షియల్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ను చవిచూసింది. అయినా కూడా పట్టు వీడని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం దక్కింది. ప్రభాస్ తో రాజా సాబ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు మారుతి. ఇది ఇలా ఉంటే తాజాగా డైరెక్టర్ మారుతి.. మచిలీపట్నంలో నిర్వహిస్తున్న మసులా బీచ్ ఫెస్టివల్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1999 లో హైదరాబాద్ కు వచ్చాను. అంతకుముందు వైజాగ్ లో అరటిపండ్లు అమ్మేవాడిని.
ఇక్కడ రాధికా థియేటర్ ఎదురుగా నాన్నకు అరటిపండ్ల బండి కూడా ఉండేది. నేను కూడా అక్కడ పండ్లు అమ్ముతూ సినిమాలు రిలీజైనప్పుడు వాటిని చూసి నా నోట్‌బుక్ లో బొమ్మలు గీసుకుంటూ ఉండేవాడిని. తర్వాత 1999లో హైదరాబాద్ కు వచ్చాను. అప్పుడు నాకు స్టిక్కరింగ్ షాపు ఉండేది. నెంబర్ ప్లేట్లు తయారు చేసేవాడిని. హిందూ కాలేజీలో చదువుకుంటూనే నెంబర్ ప్లేట్లు రెడీ చేసేవాడిని. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషి కష్టపడితే ఎంత దూరమైనా వెళ్తాడనడానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే. రూ.400 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ తీస్తున్నాను అని చెప్పుకొచ్చారు మారుతి. ఇకపోతే ఆయన దర్శకత్వం వహిస్తున్న రాజా సాబ్ సినిమా జూన్ 16 న విడుదల చేయబోతున్నట్లు ఆయన తెలుపుతూ సినిమాపై అంచనాలను పెంచేశారు.