కాప్ డ్రామాతో మెగా డాటర్ వీరంగం
`గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్` బ్యానర్ ని స్థాపించి మెగాడాటర్ సుస్మిత కొణిదల వరుసగా వెబ్ సినిమాలు .. పెద్ద తెర సినిమాల్ని నిర్మించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ లో క్రియేటివ్ ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేసేందుకు సుస్మిత పకడ్భందీ ప్లాన్ ని రెడీ చేశారు. తొలిగా వెబో సిరీస్ ని అధికారికంగా లాంచ్ చేశారు. వైరస్ మహమ్మారీ తగ్గుదలను బట్టి షూటింగ్ ని ప్లాన్ చేయనున్నారని తెలిసింది.
ఇప్పటికే `ఓయ్` ఫేం ఆనంద్ రంగాని దర్శకుడిగా ఎంపిక చేశారు. ఓయ్ తర్వాత అతడికి ఇది అరుదైన ఛాన్స్ అనే చెప్పాలి. ఇంతకీ ఈ వెబ్ సిరీస్ బ్యాక్ డ్రాప్ ఏమిటి? అన్నది ఆరా తీస్తే ఆసక్తికర సంగతులే తెలిశాయి. ఇదో థ్రిల్లర్ బేస్డ్ కాప్ యాక్షన్ డ్రామా. ఇందులో ప్రకాష్ రాజ్ పోలీస్ అధికారిగా కనిపిస్తారు. మర్డర్ మిస్టరీల్ని ఛేదించే సిన్సియర్ పవర్ ఫుల్ అధికారిగా అతడు నటిస్తుండగా.. సంపత్ రాజ్ ని వేరొక కీలక పాత్రకు ఎంపిక చేశారని తెలిసింది. వీళ్లతో పాటే పలువురు యువనటీనటులు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. `ఎక్స్ ఛేంజ్ ఆఫ్ ఫైర్` అనే ఉపశీర్షిక ను ఎంపిక చేశారు. నేరాలు పరిశోధనలు అంటూ ప్రకాష్ రాజ్ కి పెర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న కాప్ రోల్ లభించిందని చెబుతున్నారు.
ఇక విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కి మెగా ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ షిప్ గురించి తెలిసిందే. చూడాలని ఉంది సినిమాలో చిరంజీవితో కలిసి నటించిన ప్రకాష్ రాజ్ ఆ తర్వాత రెండు దశాబ్ధాలుగా ఆ ఫ్యామిలీ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇంతకుముందు గోవిందుడు అందరివాడేలే చిత్రంలోనూ ప్రకాష్ రాజ్ తాత పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సుస్మిత బ్యానర్ ఎదుగుదలలోనూ ఆయన కీలక పాత్ర పోషించనున్నారు.