‘సాహో’ కు మరో చావు దెబ్బ,నిర్మాతలు ఆవేదన

‘సాహో’ ని అప్పుడే నెట్ లో పెట్టేసారు

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా భారీ బ‌డ్జెట్ తో హై ఎండ్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన చిత్రం ‘సాహో’. టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశీ, ప్రమోద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ సినిమా ఈ రోజే ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల అయింది. అయితే మార్నింగ్ షో నుంచే ఈ సినిమా ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. సినిమాకు వచ్చిన హైప్ కు సమానంగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యిపోయింది. దాంతో టాక్ ప్రభావం ఖచ్చితంగా కలెక్షన్స్ పై పడుతుందని అనుకుంటూంటే ఇప్పుడు మరో పెద్ద దెబ్బ పడింది.

గత కొన్నేళ్లుగా సినీ పరిశ్రమకు పెను సవాల్ గా మారిన పైరసీ సంస్థ తమిళ్ రాకర్స్ ప్రభాస్ సాహో చిత్రంని సైతం రోడ్డుపై పెట్టేసింది. సాహో విడుదలైన కొన్ని గంటల్లోనే తమిళ రాకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఆన్లైన్ లో లీక్ చేసేసి పెద్ద దెబ్బ కొట్టింది. 300 కోట్ల సినిమాను ఇలా ఫ్రీ డౌన్ లోడింగ్ కు పెట్టడంతో డిస్ట్రిబ్యూటర్స్ ,నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ గోలెత్తిపోతున్నట్లు తెలుస్తోంది.

సినిమా మార్నింగ్ షో పూర్తి కాక ముందే తమిళ రాకర్స్ సంస్థ పైరసీ ప్రింట్ ని డౌన్ లోడింగ్ కి అందుబాటులో ఉంచటం అభిమానులకు కాక సినీ లవర్స్ కి సైతం బాధ కలిగించే విషయం. భారీ బడ్జెట్ లో తెరకెక్కిన సాహో చిత్రానికి ఇది పెద్ద దెబ్బే. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తమిళ్ రాకర్స్ ని అదుపు చేయడం మాత్రం ఎవరికీ సాధ్యం కావడం లేదు.