నటీనటులు: విజయ్ దేవరకొండ, రాశిఖన్నా, ఐశ్వర్యారాజేష్, కేథరిన్, ఇజబెల్లా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: క‌్రాంతి మాధవ్
నిర్మాతలు: కె.ఎ. వల్లభ, కె.ఎస్. రామారావు
సంగీతం: గోపీ సుందర్
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫి : జయకృష్ణ గుమ్మడి
ప్రొడక్షన్ కంపెనీ : క‌్రియేటీవ్ కమర్షియల్స్
రిలీజ్ డేట్ : 14 – 02- 2020
రేటింగ్ :
విజయ్ దేవరకొండ సినిమాకు యూత్‌లో మంచి క్రేజ్ వుంది. అతని సినిమా వస్తోందంటే ఆ బజ్ వేరుగా వుంటుంది. అయితే విజయ్ నటించిన తాజా చిత్రం `వరల్డ్ ఫేమస్ లవర్` చిత్రానికి ఆ బజ్ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. `డియర్ కామ్రేడ్` ఆశించిన స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా అయినా ఆ లోటుని తీరుస్తుందని విజయ్ రౌడీ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లలో ప్రతి ప్రెస్ మీట్‌లోనూ ఇదే నా చివరి లవ్‌స్టోరీ అంటూ విజయ్ దేవరకొండ పదే పదే ఎందుకు చెప్పాడు? మూడు ప్రేమకథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రౌడీ హీరో తనదైన నటనతో మ్యాజిక్ చేశాడా?. రిలీజ్‌కు ముందు బజ్ క్రియేట్ చేయని ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలని అందుకుందా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
గౌతమ్ ( విజయ్ దేవరకొండ) చేస్తున్న జాబ్ కి రిజైన్ చేసి రైటర్‌గా సెటిల్ అవ్వాలనుకుంటాడు. అందుకు తగ్గ ప్రయత్నాలు చేస్తుంటాడు కానీ సక్సెస్ కాలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంటుంది. యామిని ( రాశిఖన్నా). గౌతమ్ తో సహజీవనం చేస్తూ వుంటుంది. కాలేజ్ లవర్ కావడంతో ఇద్దరు ప్రేమలో మునిగితేలుతుంటారు. కానీ గౌతమ్ ఫ్రష్టేషన్‌ని యామిని తట్టుకోలేకపోతుంటుంది. ఈ క్రమంలో అతనికి బ్రేకప్ చెప్పేసి దూరంగా వెళ్లిపోతుంది. దీంతో గౌతమ్ మరీ పిచ్చివాడైపోతాడు. ఈ స్ట్రగుల్స్‌లోనే కొంత మంది స్ఫూర్తితో ఓ కథ రాయడం మొదలుపెడతాడు. ఇల్లందులోని బొగ్గు గనిలో పనిచేసే సీనయ్య(విజయ్ దేవరకొండ), సువర్ణ (ఐశ్వర్యారాజేష్)కున్న సంబంధం ఏంటీ?.. వాళ్ల మధ్యకి స్మిత ( కేథరిన్) ఎలా వచ్చింది?.. అలాగే పారిస్‌లో వున్న గౌతమ్ ( విజయ్ దేవరకొండ), ఇజ (ఇజబెల్లా)కు వున్న సంబంధం ఏంటి?. యామిని ప్రేమ కోసం తపించే గౌతమ్ చివరికి ఆమె ప్రేమని గెలుచుకున్నాడా?. తను కోరుకున్నట్టుగానే రచయితగా పేరు తెచ్చుకున్నాడా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటులు:
విజయ్ దేవరకొండనే ఈ చిత్రానికి మెయిన్ సేలింగ్ పాయింట్. అతను ఈ సినిమాకి వన్ మెన్ ఆర్మీ అని చెప్పొచ్చు. అతని క్యారెక్టర్ ఇందులో టెర్రిఫిక్‌గా వుంది. అతను లేకపోతే సినిమానే లేదు అనేంతగా నటించాడు. `అర్జున్‌రెడ్డి`లో 3 టు 4 వేరియేషన్స్‌ని చూపిస్తే ఇందులో మూడు వేరియేషన్స్‌తో విజయ్ పాత్ర సాగుతుంది. సీనయ్య పాత్ర ఈ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలచింది. ఈ పాత్రకు విజయ్ యాక్సెంట్ మరింత వన్నె తెచ్చింది. గౌతమ్ పాత్రలోనూ విజయ్ సిటీ గయ్‌గా అద్భుతంగా నటించాడు. అయితే అతని ఎఫర్ట్ దర్శకుడి తప్పదం కారణంగా బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ఇలాంటి పాత్రలు ఓ నటుడికి జీవిత కాలంలో ఒకే ఒక్కసారి లభిస్తాయి. అలాంటి పాత్రలో నటించిన సినిమా లైఫ్ టైమ్ మెమొరబుల్‌గా వుండాలని కోరుకుంటారు కానీ `వరల్డ్ ఫేమస్ లవర్` ఆ కోరికని, విజయ్ ఎఫర్ట్‌ని నీరుగార్చిందనే చెప్పాలి.
విజయ్ తరువాత అంతగా ఆకట్టుకున్న పాత్ర సువర్ణ. ఈ పాత్రలో ఐశ్వర్యారాజేష్ జీవించింది. సినిమా మొత్తానికి సీనయ్య, సువర్ణల ట్రాక్ అల్టిమేట్ అని చెప్పొచ్చు. భావోద్వేగా సన్నివేశాల్లో ఐశ్వర్యా రాజేష్ నటనకు ఎక్కడ వంక పెట్టలేం. డీ గ్లామర్ పాత్రలో మనసులు గెలుచుకుంది. ఆ తరువాతి స్థానం గౌతమ్, యామినిలది. యామినిగా రాశీ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఎక్కువ సన్నివేశాల్లో రాశి ఏడుస్తూనే కనిపించడం ఆ పాత్ర మరింతగా ప్రేక్షకుల్లోకి వెళ్లకుండా చేసింది. కేథరిన్ ఇజబెల్ల పాత్రలకు అంత ప్రాధాన్యత లేదు. దాంతో ఒక విధంగా వారి పాత్రలు వేస్టయిపోయాయి అని చెప్పొచ్చు.
సాంకేతిక వర్గం:
లవ్‌స్టోరీస్‌కి తెలుగులో గోపీసుందర్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. ఆయన చేసిన సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే ముద్రపడిపోయింది. ఇటీవల తెలుగులో ఆయన చేసిన చిత్రాలేవీ ఫ్లాప్‌గా నిలవలేదు. మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ విజయాన్నే దక్కించుకున్నాయి. దాంతో ఈ సినిమా కూడా ఆ స్థాయిలోనే వుంటుందని అంతా భావించారు. పాటలు, నేపథ్య సంగీతం విషయంలో గోపీ సుందర్ నూటికి నూరు శాతం బెస్ట్ ఇచ్చాడు. జయకృష్ణ గుమ్మడి ఫొటోగ్రఫీ బాగుంది. ప్రతీ ఫ్రేమ్ ని అందంగా చూపించే ప్రయత్నం చేశారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ మరింత పదును పెడితే బాగుండేది. ఉన్నంత వరకు బాగానే వుంది కానీ మరింత క్రిస్పీగా కట్ చేస్తే బాగుండేది. క్రియేటీవ్ కమర్షియల్ నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు తీసుకున్న పాయింట్ కొత్తగా వుంది. అయితే దాన్ని మరింత ప్రభావవంతగా నడిపించి స్క్రీన్‌ప్లే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని వుంటే బాగుండేది.
విశ్లేషణ:
దర్శకుడు క్రాంతి మాధవ్ చాలా టఫ్ కథని ఎంచుకుని ఈ సినిమా తీశాడు. అయితే అందుకు తగ్గట్టుగా స్క్రీన్‌ప్లేని పక్కాగా రాసుకుంటే బాగుండేది. అలా చేస్తే ఫలితం మరోలా వుండేది. మూడు కథల్ని ప్యార్‌లల్‌గా నడిపించినా అన్ని కథల్ని లింకప్ చేయడం, ఆ ఫీల్‌ని, మ్యాజిక్‌ని క్రియేట్ చేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్‌ని అద్భుతంగా నడిపించిన ఆయన సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి అనవరమైన ట్రాక్‌లని జోడించి కన్ఫ్యూజన్‌కి గురైనట్టు తెలుస్తోంది. ఒక విధంగా సెకండ్ హాఫ్‌లో చేతులెత్తేసిన భావన కలుగుతుంది. నిడివి కూడా ఓ మైనస్‌గా మారింది. ప్రేక్షకుడి మూడ్‌ని డీవేట్ చేస్తూ అసహనాన్ని కలిగించేలా వుంది. ఇన్ని డ్రాబ్యాక్స్ వున్న ఈ చిత్రానికి మెయిన్ ఎస్సెట్ మాత్రం విజయ్ దేవరకొండనే. అతని క్రేజే ఈ సినిమాని కాపాడాలి.